ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు బాగా కలిసివచ్చింది అని తెలుస్తుంది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో  తెలంగాణ సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017 సంవత్సరంలో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈ సారి క్రాస్‌ చేసింది. ఏకంగా డబుల్ ఆదాయం వచ్చింది అంటే నమ్మండి. రాష్ర్టంలో 2వేల 216 దుకాణాలు ఉండగా ‌‌‌‌‌‌‌మొత్తం 45వేల 385 దరఖాస్తులతో ‌‌‌‌‌‌ రూ.907.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం జరిగింది. 


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్కడున్న మద్యం వ్యాపారులు ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. గతంలో పాలసీలో నాన్ రీఫండబుల్  దరఖాస్తు ఫీజు లక్ష ఉండగా, ఈ సారి ప్రభుత్వం రెండు లక్షలుగా నిర్ణయించిన సంగతి అందరికి తెలిసిందే. ఫీజు డబ్బులు మొత్తం ప్రభుత్వ ఖజానాలోకే  పోతాయి. 

ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో అనేక మంది కొత్తవారితోపాటు పెద్దసంఖ్యలో మహిళలు ఉండటం చాల  గమనార్హం. ఈ దరఖాస్తులు 18వ తేదీన డ్రా తీయబోతున్నారు. బుధవారం ఆఖరి గడువు రోజు కావడంతో పెద్ద సంఖ్యంలో దరఖాస్తులు రావడం జరిగింది. బుధవారం ఒక్క రోజే 24, 448  అప్లికేషన్లు వచ్చాయని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ తెలియచేశారు.


వరంగల్ డివిజన్‌లో 261 దుకాణాలకు అత్యధికంగా 7,864 అప్లికేషన్లతో రూ.157.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక హైదరాబాద్ డివిజన్‌లో 173 దుకాణాలకు 1,462 దరఖాస్తులే వచ్చాయి. ఇక్కడ రూ.29.24 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో 4,282 అప్లికేషన్లకు రూ.85.64 కోట్లు, నల్లగొండలో 3,031 దరఖాస్తులకు 60.62 కోట్లు, కొత్త గూడెంలో 2,989 దరఖాస్తులకు 59.78 కోట్లు, సూర్యాపేటలో 2,384 దరఖాస్తులకు 47.68 కోట్ల ఆదాయం రావడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: