దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసు వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. 40 రోజులపాటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలో  ప్రతిరోజూ విచారణ నిర్వహించిన సుప్రీం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. అనుకున్నట్లుగానే బుధవారం వాదనలను ముగిస్తున్నట్లు ప్రకటించి పిటిషనర్లకు లిఖితపూర్వకంగా తెలియజెప్పేందుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఇక తీర్పు వెలువడటమే తరువాయి.

రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పలు అప్పీళ్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అలహాబాద్‌ హైకోర్టు ఈ వివాదాస్పద స్థలాన్ని ముగ్గురు పిటిషనర్లకు సమంగా పంచాలని నిర్దేశిస్తూ వెలువరించిన తీర్పును హిందూ మహాసభ, ఇతర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు చరిత్రలోనే చాలాకాలం పాటు మౌఖిక విచారణ జరిపిన కేసుగా అయోధ్య వివాదం కేసు నిలిచింది. 2.77 ఎకరాలకు సంబంధించిన ఈ వివాదానికి బీజం ఏడు దశాబ్దాల క్రితమే పడిందని చెప్పాలి. అయితే, రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్‌ గొగొయ్‌ పదవీ విరమణ చేయనున్నారు.

కాబట్టి నవంబర్‌ 17లోపు  తీర్పు ప్రకటించే అవకాశముంది. మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనడంలో హిందూ, ముస్లిం వర్గాలు విఫలమైన నేపథ్యంలో ఈ ఆగస్ట్‌ 6వ తేదీ నుంచి జస్టిస్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక తీర్పు ఏరూపంలో ఉంటుందన్నదే ఇప్పుడు అందరి నోటా నలుగుతున్న చర్చ. అత్యధిక దస్త్రాలను దాఖలుచేసిన పిటిషనర్లు పురావస్తుశాఖ ప్రాచీన వివరాలనుసైతం అందచేస్తూ ఈ స్థలంలో రామాలయాన్ని నిర్మించారని, రామ జన్మభూమి అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడనడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను సుప్రీంకు నివేదించి చివరి నిమిషం వరకూ అదే వాదనను కొనసాగించారు.

బ్రిటిష్‌ కాలంలో కూడా ఆనాటి పాలకులు బాబర్‌ కాలం నాటి సాంప్రదాయాన్నే గుర్తించారు. నవాబులు ఇదే కొనసాగించారు. 1885 నుంచి ఉన్న దస్త్రాలను ఈ వివాదాస్పద స్థలంపై దాఖలు చేసారు. ఆ దస్త్రాలను చూస్తే.. మసీదు ఉందని చూపిస్తున్నాయి. 1949 వరకూ ముస్లింలు ఈ స్థలాల్లోనే ఈద్‌ ప్రార్థనలు నిర్వహించే వారని ఉన్న రికార్డులను ముస్లిం సంఘాల నేతలు సుప్రీంకు వివరించారు. ఎంతమాత్రం నిజం కాదంటూ చరిత్రకారులు పలు ప్రభుత్వ గెజిట్‌లను ఈ సందర్భంగా ఉదహరిస్తూ మసీదు ఉందన్న వాదనల్లో పస లేదని మందిరం ఉందని అందుకు సంబంధించిన ఆధారాలు వారివంతుగా వారు దాఖలుచేసారు. ఇలాంటి కేసు సుప్రీంకోర్టు చరిత్రలో ఎక్కువ కాలం కొనసాగిన కేసు విచారణల్లో ఇది రెండోది కావడం విశేషం. మొదటి కేసు 1973 నాటి చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు.   


మరింత సమాచారం తెలుసుకోండి: