టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచార‌ణ మ‌లుపులు తిరుగుతోంది. నిధుల దుర్వినియోగం కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్ప‌టికే జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మరో డైరెక్టర్‌తో కలిసి సీఈఓ రవిప్రకాశ్‌ రూ. 18 కోట్లను పక్కదారి పట్టించినట్లుగా ఆధారాలతో టీవీ 9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయ‌గా అనంత‌రం ఆయ‌న్ను కోర్టుకు త‌ర‌లించారు. తాజాగా నకిలీ ఐడీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మ‌రో కేసు నమోదైంది. 


ప్ర‌స్తుతం పోలీసులు పేర్కొంటున్న వివ‌రాల ప్ర‌కారం, ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద రవిప్రకాశ్ ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఈ ప్ర‌క్రియ‌తో ప‌లు అవ‌క‌త‌వక‌ల‌కు పాల్ప‌డ్డార‌నే ఫిర్యాదు నేప‌థ్యంలో 406/66 ఐటీ యాక్ట్ కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. త‌దుప‌రి విచార‌ణ‌లో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా పోలీసులు మియాపూర్ కోర్టుకు రవిప్రకాశ్‌ను త‌ర‌లిస్తున్నారు.


కాగా, గ‌తంలో  టీవీ 9 సీఈవో సింగారావు ఫిర్యాదుతో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగారావు ఫిర్యాదులో..రవి ప్రకాశ్ రెండేళ్ల కంపెనీ లాభాలను పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విత్ డ్రా చేసిన డబ్బులను రవిప్రకాశ్ బోనస్‌గా చూపించారని పేర్కొన్నారు. డైరెక్టర్ల అనుమతి లేకుండా కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో ముగ్గురి పేర రూ. 18,31,75,000 విత్ డ్రా చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవి ప్రకాశ్ పేరుతో 6 కోట్ల 36 లక్షలు, ఎంకేవీఎస్ మూర్తి పేరుతో రూ. 5,97,87,500, క్లిఫర్డ్ పేరుపై రూ.5,97,87,500 విత్ డ్రా చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య వరకు ముగ్గురి పేరిట లావాదేవీలు జరిగాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవి ప్రకాశ్, మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: