మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరడంతో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో మళ్లీ తమదే అధికారమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.


ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 289 అసెంబ్లీ స్థానాలుంటే, 288 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  బీజేపీశివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా పోటీచేస్తున్నాయి. బీజేపీ 164 చోట్ల, శివసేన 124 సీట్లలో పోటీచేస్తున్నాయి. 8.9 కోట్ల ఓటర్లున్న మహారాష్ట్రలో ఈసీ 95,473 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తోంది. 


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. బీజేపీశివసేన కలిసి మూడింటిలో రెండొంతుల సీట్లను గెలుచుకుంటాయంటున్నారు బీజేపీ అధినేత అమిత్ షా. 2014లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి.. 122 స్థానాలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 63 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి మరో 22 సీట్లు అవసరం కావడంతో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ 42 స్థానాలు, ఎన్సీపీ 41 స్థానాలు గెలచుకున్నాయి. ఎంఐఎం రెండు స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. శివసేనతో కలిసి పోటీ చేస్తున్నా,  బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ప్రధాని నరేంద్ర మోడీ జోడి మహారాష్ట్ర అభివృద్దికి దోహదం చేశాయన్నారు అమిత్ షా. బీజేపీ కార్యకర్తలు జనంలోకి వెళ్లి... ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ రాష్ట్రానికి చేసిన అభివృద్దిని వివరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో అభివృద్ది శరవేగంగా జరుగుతోందన్నారు. అయితే, శివసేనతో కలిసి  పోటీచేస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏదో ఒకరోజు శివసైనికుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల ప్రచారంలో అంటున్నా, షా వ్యాఖ్యలతో వారి ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలోకి వస్తే కచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, శివసేనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని షా తేల్చి చెప్పారు.


మరోపక్క శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే  ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండటం కూడా రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. శివసేన ఎన్నికల హామీలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పది రూపాయలకే ఉచిత భోజన పథకాన్ని శివసేన ప్రకటించడాన్ని తప్పుబట్టారు. గతంలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో శివసేన కార్యకర్తలు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో తెలుసని వ్యాఖ్యానించారు.  


ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోరాడటం లేదన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణలను శరద్ పవార్ ఖండించారు. నిజంగానే ప్రతిపక్షాలు అంత బలహీనంగా ఉంటే,  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమిత్ షా కేవలం అధికరణ 370రద్దును మాత్రమే ప్రస్తావిస్తున్నారని, నిరుద్యోగం, అభివృద్ధి, మహిళల పరిరక్షణ, వ్యవసాయం తదితర అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: