హర్యానా ఎన్నికల వేళ.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ అన్న ఖట్టర్ ట్వీట్ పై దుమారం రేగడంతో.. ఆయన దాన్ని డిలీట్ చేశారు. అయితే ఖట్టర్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో కశ్మీరీ యువతులపై, నిన్న కాక మొన్న సోనియాపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హర్యానా సీఎం. 


హర్యానాలో మిషన్ 75 ప్లస్ అంటూ ప్రచార బరిలో దిగింది బీజేపీ. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. సీఎం ఖట్టర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ఈవీఎం అంటే ప్రతి ఓటు మోడీకే అంటూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. దీనికి ఎవ్రీ ఓట్ ఫర్ మనోహర్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు. పార్లమెంట్‌కు సంబంధించి ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోడీ, రాష్ట్రానికి సంబంధించి ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మనోహర్‌.. ఇదీ ఈవీఎంకు ఖట్టర్ మార్క్ వివరణ. 


మోడీకి వేసినా, తనకు వేసినా ఇద్దరి ఎన్నికల గుర్తు కమలమేనని వీడియోలో చెప్పారు మనోహర్ లాల్ ఖట్టర్. ఈ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. ఈవీఎంలపై సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని పట్టుబడుతున్నా.. బీజేపీ మాత్రం ఈవీఎం పద్ధతిలోనే ఎందుకు వెళుతుందో ఇప్పుడు అర్థమవుతోందంటూ చురకలు అంటించారు.  వీరితో పాటు మరికొందరు విమర్శలు గుప్పించడంతో ఖట్టర్‌ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. 


హర్యానా సీఎం ఖట్టర్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో కశ్మీరీ యువతులపై కూడా ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుతూ.. అందమైన కశ్మీరీ యువతుల్ని కోడళ్లుగా తెచ్చుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు ఖట్టర్. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపైనా నోరు పారేసుకున్నారు. కొండను తవ్వి ఎలుకని పట్టిన చందంగా.. కాంగ్రెస్ నేతలు అధ్యక్ష పదవికి చచ్చిన ఎలుకను తెచ్చి పెట్టారన్నారు. హర్యానాలో హాట్ టాపిక్ గా ఉన్న నేరాలు, ఇతరత్రా సమస్యల్ని కూడా ఆయన చిన్న విషయాలుగా అభివర్ణించడం కూడా కలకలం రేపింది. అయితే ఖట్టర్ వ్యాఖ్యల ప్రభావం ఎన్నికలపై ఉండదని, మోడీ వేవ్ ఉంటుందని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: