లోటు బడ్జెట్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉండటం, ఆదాయ మార్గాలు కూడా లేకపోవడంతో సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చలేక ముఖ్యమంత్రి జగన్‌‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయించండి, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు చెబుతున్న సమస్యల పరిష్కారానికి నిధుల్లేక ఇబ్బందిగా ఉందని అంజాద్‌ బాష బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో అడిగారట.

దీనికి జగన్‌ స్పందిస్తూ.. ‘డబ్బులు ఎక్కడున్నాయి.. చంద్రబాబు రూ.65 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌ పెట్టిపోయారు. వాటిని సర్దుబాటు చేసేందుకు తలకిందులుగా తపస్సు చేస్తున్నా, ఆర్థికశాఖ వాళ్లు అల్లాడిపోతున్నారు. రైతు భరోసాకు రూ.5వేల కోట్లు తీసిపెట్టేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింద’ని సమాధానం ఇచ్చారట.తర్వాత తాగునీటి అవసరాల కోసం నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున అందజేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం సూచించారు.ఈ నాలుగైదు నెలల్లో ఎక్కువ శాతం మంత్రులు బాగా పనిచేశారని, ఒకరిద్దరిపై కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయని, వారిని వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడతానని అన్నారట.


‘ప్రతిపక్షం ఒకటే కాదని, కొన్ని మీడియాలు కూడా హైపర్‌యాక్టివ్‌గా ఉన్నాయని మీరు ఏ చిన్న తప్పు చేసినా అవి అతిచేస్తాయి.. మీపై చర్యలు తీసుకునేలా నాపై ఒత్తిడి వస్తుంది. అప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది.అలాంటి పరిస్థితి తీసుకురావద్దు.. 150 మంది ఎమ్మెల్యేల్లో మిమ్మల్ని ఏరికోరి మంత్రులుగా ఎంపిక చేశా. నా నమ్మకాన్ని వమ్ముచేయకండి’ అని జగన్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.


అయితే, క్యాబినెట్ భేటీ ముగిసి అధికారులు బయటకు వెళ్లిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఆరోపణల అంశాన్ని స్వయంగా సీఎం ప్రస్తావించడంతో మంత్రులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారట.తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ..మా తప్పులుంటే వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడాలని అనగానే... పిలిచే రోజు వస్తే పిలుస్తా, ఈలోపు ఎవరైనా మాట్లాడాలనుకుంటే నన్ను కలవండని జగన్ సూచించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: