రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించాలనుకోవడం అప్రజాస్వామికమని,  మీడియాను అణచివేయడం నియంత్రత్వపోకడలకు సంకేతమని, ప్రభుత్వచర్యను ప్రజాస్వా మ్యవాదులెవరూ హర్షించరని టీడీపీ అధికారప్రతినిధి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ స్పష్టంచేశారు. ప్రజాసామ్యమనుగడకు ప్రమాదం వాటిల్లేలా ప్రభుత్వం ఈవిధంగా చీకటి ఆలోచనలు చేస్తే, ప్రజలే తగిన బుద్ధిచెబుతారని డొక్కా హెచ్చరించారు. మీడియాస్వేచ్ఛను ఎల్లకాలం హరించలేరని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం సాధ్యంకాదనే విషయాన్ని సర్కారు గుర్తించాలన్నారు. 

ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలకు తెలియచేస్తూ, ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రసారమాధ్యమాలను కట్టడిచేయాలనుకోవడం    ఎప్పటికీ సాధ్యంకాదన్నారు. మీడియాపై ప్రత్యేకంగా, ఏబీఎన్‌, టీవీ-5, ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి సంస్థలపై ప్రత్యేక గురిపెట్టడం ఏమిటని డొక్కా ప్రశ్నించారు. మీడియా తమకు భజనచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడమే తప్పన్న ఆయన, ప్రతిపక్షం ప్రజలపక్షాన మాట్లాడటాన్ని, ప్రజాసమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడాన్ని కర్తవ్యంగా భావించే మీడియాను అడ్డుకోవడమంటే ప్రజలను అడ్డుకోవడమేనని మాజీమంత్రి తేల్చిచె ప్పారు. ప్రభుత్వాధినేతకు కూడా పత్రిక, ఛానల్‌ ఉన్నాయని, అవి కూడా వేరేవారికి భజన చేయాలంటే మీరు ఒప్పుకుంటారా అని ఆయన నిలదీశారు.

తాను వైసీపీలో చేరుతున్నానన్న వార్తలు చాలా దుర్మార్గమని, వాటిని ఖండిస్తున్నానని డొక్కా స్పష్టంచేశారు.  పార్టీ మారేఆలోచన తనకు లేనేలేదని, చంద్రబాబు నాయకత్వాన్ని తాను పూర్తివిశ్వాసంతో సమర్థిస్తున్నానని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీలో ఉంటూ, ప్రజలకు మేలుచేసే నిర్ణయాల్లో భాగస్వామినవుతూ, ప్రతిపక్షం తరుపున పోరాటం చేస్తామ ని డొక్కా తెలిపారు. తనవిషయంలో  పార్టీమార్పు వంటి ప్రచారాలు చేయడం ఎవరికీ మంచిదికాదన్నారు. కష్టకాలంలో నన్ను నమ్మి, నాకు అండగానిలిచిన పార్టీకోసం, ఇంకా ఇష్టపడిపని చేస్తాను తప్ప, ఇలాంటివి చేయబోనని, కేవలం ఒకవ్యక్తి చేసిన దుష్ప్రచారం వల్ల తనపై ఇలాంటి వదంతులు వచ్చాయని మాణిక్యవరప్రసాద్‌ వివరించారు.  తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీని వదిలే పరిస్థితి లేదని, టిడిపిలోనే చివరి క్షణం వరకు ఉంటానని అన్నారు డొక్కా మాణిక్యవర ప్రసాద్.  


మరింత సమాచారం తెలుసుకోండి: