క్షేత్రస్ధాయిలో జరగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న  ఆర్టీసీ  కార్మికులతో అసలు చర్చలే జరిపేది లేదన్నారు. సమ్మె చేయటానికి దాదాపు నెల రోజుల ముందే నోటీసిచ్చినా అసలు లెక్కే చేయలేదు. సమ్మె మొదలైన తర్వాత సుమారు 43 వేలమంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అంటూ ఓ పిచ్చి ప్రకటన చేశారు. సెప్టెంబర్ మాసం జీతాలు ఇవ్వకుండా నిలిపేశారు.

 

ఎన్ని రోజులు సమ్మె చేసినా చర్చలకు పిలిచేదే లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అలాంటి వ్యక్తి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపే విషయాన్ని ఆలోచిస్తున్నారు. నిలిపేసిన సెప్టెంబర్ మాసం జీతాన్ని కూడా ఇచ్చేస్తున్నారు.  కార్మిక సంఘాల నేతలతో చర్చల కోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటుకు ఆలోచిస్తున్నారు. ఇదంతా కెసియార్  గురించే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

కెసియార్ మొండి వైఖరి గురించి అందరికీ తెలిసిందే. కానీ అన్నీసార్లు మొండిగా వెళితే మాడు పగులుతుందన్న విషయాన్ని కెసియార్ మరచిపోయారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జరిగిందదే. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు ఎందుకు జరపటం లేదని కోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పనిచేసిన సెప్టెంబర్ నెలకు జీతాలు ఎందుకు నిలిపేశారంటే జవాబు చెప్పలేకపోయారు.

 

ఆర్టీసీ సమ్మె వల్ల జనాలు పడుతున్న అవస్తలకు బాధ్యత ఎవరు వహిస్తారన్న కోర్టు ప్రశ్నకు  ప్రభుత్వం చేతులెత్తేసింది.  ప్రభుత్వం మొండి వైఖరి వల్లే జనాలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నారన్న కోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం తలదించుకున్నది. ఈ పరిస్దితి  ఎందుకు వచ్చిందంటే కెసియార్ మొండి వైఖరి వల్లే అనే చెప్పాలి.

 

సమ్మె నోటీసు ఇచ్చినపుడే వాళ్ళని పిలిచి సముదాయించుంటే జనాలకు ఇబ్బందులూ తప్పేది. కోర్టులో తలదించుకునే పరిస్ధితి వచ్చేది కాదు. ఏం చేసుకుంటారో చేసుకోమని అన్న కారణంగా కోర్టుతో చివాట్లు తినాల్సొచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కోర్టు ఆదేశాలతో కార్మిక సంఘాలతో చర్చలు, జీతాల చెల్లింపు చేయాల్సొచ్చింది. అంటే కెసియార్ తోక ముడిచేసినట్లే కదా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: