అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఏపీలోని నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించి సీఎం జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరిట దాదాపు 4 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చారు. అయితే వీటిల్లో గ్రామ వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగాలు కావు. వీటిని పక్కనబెడితే జగన్ గ్రామ సచివాలయాల పేరిట దాదాపు 1.28 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని ఇచ్చారు. ఈ స్థాయిలో ఇన్ని ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సీఎం కూడా ఇవ్వలేదు.


 కేవలం ఈ ఘనత తొలిసారి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఏదో మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఉద్యోగాలని విప్లవం మాదిరి చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. అలాగే గ్రామ సచివాలయంలో ఉద్యోగులని ఇప్పటికే నియమించేశారు. ఈ క్రమంలోనే జగన్ మరింత మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరేలా ఓ నిర్ణయం తీసుకున్నారు.


ఎస్సీ, ఎస్టీల్లో అర్హులైన అభ్యర్థులు చాలా జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో ఇప్పటికే కటాఫ్‌ మార్కులను 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. అయినా సరే పూర్తిస్థాయిలో నియామకాల లేకపోయేసరికి. సున్నా మార్కులొచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కడప కలెక్టర్‌ అధికారులను తాజాగా ఆదేశించారు. ఇదే నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.


అయితే ఈ ఉద్యోగాల విప్లవాన్ని జగన్ ఇంతటితో ఆపాలని అనుకోవడం లేదు. ప్రతి యేటా ప్రభుత్వ ఉద్యోగాలని జనవరి నెలలో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగిన విధంగా ఉద్యోగాల క్యాలెండర్ ని రూపొందించాలని అధికారులని కూడా ఆదేశించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాలను రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేయడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి రానున్న రోజుల్లో జగన్ మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి ఏపీలో సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: