ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బయటపడటానికి టీడీపీ అధినేత గట్టిగానే కష్టపడుతున్నారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపైన పోరాడుతూనే...మరోవైపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలని చుస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి నేతల్లో ధైర్యం నింపి, యాక్టివ్ గా పని చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలోనే నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజులు అక్కడే ఉండే నియోజకవర్గాల వారీగా నేతలకు క్లాస్ తీసుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నేతలకు హితబోధ చేశారు.


సరే సమీక్షా సమావేశం ముగిసింది చంద్రబాబు వేరే జిల్లా పర్యటనలలో బిజీగా ఉన్నారు. అయితే చంద్రబాబు క్లాస్ తీసుకున్న విశాఖ నేతలు యాక్టివ్ అయ్యారా అంటే? కాదనే చెప్పాలి. సమీక్షా సమావేశం అయ్యాక నేతలు యాక్టివ్ అయినట్లు కనిపించలేదు. మొన్న ఎన్నికల్లో సిటీలోని నాలుగు స్థానాలు టీడీపీనే గెలిచింది. అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ సైలెంట్ అయిపోయారు.


మొదట నుంచి పార్టీ మారతారని వార్తలు వచ్చిన గంటా చంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు. పోనీ తర్వాత నుంచి యాక్టివ్ ఉంటారనుకుంటే అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు. ఇక రూరల్ ల్లోనే నేతల్లో ఒక్క నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు మినహా ఎవరు పెద్దగా కంటికి కనిపించడం లేదు.


చోడవరం మాజీ ఎమ్మెల్యే కే‌ఎస్‌ఎన్ రాజు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, యలమంచిలి పంచకర్ల రమేశ్ బాబు, పాయకరావుపేట వంగలపూడి అనిత, పాడేరు గిడ్డి ఈశ్వరి, అరకు కిడారి శ్రవణ్ కుమార్, మాడుగుల గవిరి రామానాయుడు, గాజువాక పల్లా శ్రీనివాస్ లు మళ్ళీ అడ్రెస్ లేరు. మొత్తానికి బాబు సమీక్షలు బూడిదలో పోసిన పన్నీరే అయిపోయాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: