తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ కార్మికులు సమ్మెకు దిగారు.  అయితే, కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగా, సెల్ఫ్ డిస్మిస్ పేరుతో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.  దీంతో కార్మికులు సమ్మెను మరింతగా ఉదృతం చేయడంతో ప్రజలు ఇబ్బందుల్లో పడిపోయారు.  


అటు ప్రభుత్వం మాత్రం కార్మికులతో చర్చలు జరిపేందుకు ససేమిరా అంటోంది.  తమను చర్చలకు పిలిస్తే వస్తామని, డిమాండ్లు మాత్రం నెరవేరకపోతే.. సమ్మె ఆపేది లేదని అంటున్నారు.  దీనిపై హైకోర్టు సైతం సీరియస్ అయ్యింది.  కార్మికుల 40 డిమాండ్లలో 25 డిమాండ్లు చాలా చిన్నవే అని వాటిని ఎందుకు పరిష్కరించడం లేదని ప్రభుత్వం ప్రశ్నించింది.  


ఆర్టీసీ కార్మికులకు మద్దతు పెరుగుతుందని, ఇప్పుడు సమ్మెను ఆపకపోతే.. అది తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నట్టుగా హైకోర్టు పేర్కొన్నది.  రేపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది.  వివరాలను అక్టోబర్ 28 వ తేదీన నివేదిక రూపంలో అందించాలని కోర్టు పేర్కొన్నది.  కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా.. లేదంటే లైట్ గా తీసుకుంటుందా చూడాలి.  


ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే రేపటి రోజున బంద్ జరుగుతుందా లేదా అన్నది కూడా చూడాలి.  బంద్ విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టుదలతో ఉన్నారు.  బంద్ ను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులు బంద్ కు దిగితే.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.  మరి చూడాలి రేపు ఏం జరగబోతుందో.  అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు వెళ్లగా 6వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు విధుల్లోకి వచ్చినవాళ్లే ఆర్టీసీ కార్మికులుగా గుర్తింపబడతారని, మిగిలినవాళ్లు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత వాళ్లతో చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: