జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పెద్ద షాక్ ఇచ్చారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిపై పవన్ అడ్డదిడ్డమైన ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అదే సమయంలో రాపాక తన నియోజకవర్గంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 

రాపాక చేసిన పాలాభిషేకం విషయం బయటపడగానే జనసేనలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది.  పైగా ఒకవైపు హైదరాబాద్ లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతున్న సమయంలోనే రాజోలులో రాపాక జగన్ ఫొటోకు పాలాభిషేకం చేయటం కలకలం రేపింది. ఎంఎల్ఏ చేసిన విషయం  తన దృష్టికి రాగానే సమావేశంలోనే పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వం ఈమధ్యనే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూపొందించిన ’వాహనమిత్ర’ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 10 వేలు వేస్తున్నారు. దాంతో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. దానికి మంత్రి పినిపె విశ్వరూప్ తో పాటు స్ధానిక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత జగన్ చిత్రపటానికి అందరూ పాలాభిషేకం చేశారు.

 

సరే మంత్రి, నేతలు కాబట్టి జగన్ ఫొటోకు పాలాభిషేకం చేయటంలో తప్పేమీ లేదు. అయితే అక్కడే ఉన్న రాపాక కూడా ఫొటోకు పాలాభిషేకం చేయటమే సంచలనంగా మారింది. గతంలో కూడా  జగన్ ఫొటోకు రాపాక ఓసారి పాలాభిషేకం చేసినపుడు పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేత నాగుబాబు కూడా ఇదే విషయమై రాపాకను నిలదీసినట్లు సమాచారం.

అయితే రాపాక మాత్రం తన స్టైలే వేరనట్లుగా సాగుతున్నారు. అయితే పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపైన కూడా రాపాక మండిపోతున్నారట. అందుకనే వైసిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే రాపాక అసలు వైసిపి నేతే. మొన్నటి ఎన్నికల్లో రాజోలులో  టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ చెప్పటంతోనే అప్పటికప్పుడు జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుని పోటి చేసి గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: