``హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించాం.. ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం.. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుంది. `` అని ప్ర‌క‌టించి క‌నీసం వారం కూడా తిర‌క్కుండానే...``టీఆర్ఎస్ పార్టీకి మా మ‌ద్ద‌తు ఉప‌సంహరించుకుంటున్నాం.ఆర్టీసీ కార్మికుల‌కు సంఘీభావంగా నిలుస్తాం`` అని ప్ర‌క‌టించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి నియంత ముఖ్యమంత్రిని చూడలేదని విమర్శించారు.తెలంగాణ‌ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంద‌ని మండిప‌డ్డారు. 


తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఓ మీడియా సంస్థ‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..14 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె పరిణామాలపై చాడ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అన్నారు.  గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన సంఘాలను చర్చలకు ఆహ్వానించి పరిష్కారమయ్యే సమస్యలు, కానివి వివరించే వారని గుర్తు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నియమించేవారని చెప్పారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించేది లేదని ఏకపక్షంగా ప్రకటించడం సరైంది కాదన్నారు. 


గ‌తానికి, ప్ర‌స్తుతానికి ఉన్న తేడాను చాడ వివ‌రిస్తూ..``సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రాతినిధ్యం చేసేందుకు అవకాశం లేదు. వినతిపత్రాలు గిట్టవు. లేదు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతున్నది. గతంలో సీఎంలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే, ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు. ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రజాప్రతినిధులను కలిసేవారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో చర్చించేవారు. మంత్రివర్గ ఉపసంఘం నియమించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. `` అని పేర్కొన్నారు. ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికులు పట్టుదలకు పోకుండా వ్యవహరించాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: