ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర బంద్ ముమ్మరంగా నిరసనలు.. అరెస్టుల మధ్య కొనసాతుంది. బంద్ ప్రభావం కనిపించకుండా చేసే క్రమంలో కన్పించిన వివిధ పక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శనివారం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా పలు చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలువురిని ముందస్తు అరెస్ట్‌లు చేశారు పోలీసులు. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.



తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగ సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు కూడా బంద్‌కు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బస్సులను నడిపించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ ముందుగానే బంద్ ప్రకటించడంతో ఒక్క బస్సు కూడా కదలడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వినర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వమే స్పందించడం లేదని, కోర్టు ఆదేశంతోనైనా ప్రభుత్వం చర్చలకు రావాలని చెప్పారు. అయితే తాము ప్రభుత్వం ముందుంచిన 25 డిమాండ్లను నెరవేర్చేందుకు చర్చ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు.





కార్మికుల జీతాలు పెరిగినందువల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన పచ్చి అబద్దమని  ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వర్ కొట్టిపారేశారు. ఆర్టీసీ సమ్మె 15 వ రోజుకు చేరినా.. కోర్టు చర్చలు జరపమని చెప్పినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమేంటని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్ సగటు వేగం 15కి.మీ. ఇందుకు కారణం ట్రాఫిక్, రోడ్లు బాగాలేకపోవడమేనన్నారు. రూ. లక్ష 60వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణా ప్రభుత్వం కోటి మందికి సేవ చేసే ఆర్టీసీకి 700 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు.. కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకు అని అడిగారు. ప్రభుత్వం చేసేది నష్టాల జాతీయకరణనా లేక లాభాల ప్రైవేటీకరణనా అంటూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్ల రోజుకి ఆర్టీసీ రూ. 80లక్షల వడ్డీ కడుతోందన్నారు. ప్రభుత్వానికి చేతకాక పోతే తమకు అప్పచెప్పలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఆర్టీసీని వేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తామని  అని నాగేశ్వర్ స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: