ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ సమ్మె  అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన  విషయం మన అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో  తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన రాష్ట్ర బంద్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా రోడ్లపైకి వస్తున్న విపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.


తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా మోత్కుపల్లి నర్సింహులని అరెస్టు చేసి లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ గృహనిర్బంధం చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్‌, భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సంఘాల నేతల్ని సైతం ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు.ఆర్టీసీ కార్మికుల బంద్‌ నేపథ్యంలో బస్‌ భవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనాకారులను నియంత్రించేందుకు ప్రవేశ ద్వారం ఎదుట బారికేడ్లతోపాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బంద్‌ ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదావేశారు. బంద్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. అక్టోబర్ 17, 18, 19వ తేదీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, వాటి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇక మిగిలిన పరీక్షలు అన్ని  అక్టోబర్ 21నుండి  జరగనున్నాయి. రీ షెడ్యూల్ తేదీలను  త్వరలో అధికారిక వెబ్ సైట్‌లో తెలుపనున్నట్లు అధికారులు ప్రకటించారు.


పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేదని  ఓయూ అధికారులు తెలిపారు. దీని ఫలితంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా, బస్సులను నడపడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీర్ ఆర్టీసీ అధికారికి తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు ఆర్టీసీ నుంచి 3 వేల బస్సులు, విద్యా సంస్థల వాహనాలతో పాటు సుమారు 2,500 ప్రైవేటు బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రోజూ నడుస్తున్నాయని ఆర్టీసీ సీనియర్ అధికారి తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: