పాపం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఇక రాంరాం చెప్ప‌నున్నారా..?  జ‌న‌సేన పార్టీలో జ‌రుగుతున్న అవ‌మానాల‌కు తట్టుకోలేక త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ద‌మ‌య్యాడా.. ద‌ళిత కులంలో పుట్టి త‌న‌దైన మార్క్ రాజ‌కీయంతో ముందుకు సాగుతున్న రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న చూపు చూస్తున్నాడా..? ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ద‌ళితులు అంటే గిట్ట‌దా.. లేక పార్టీలో మాజీ స్పీక‌ర్ నాదేండ్ల మ‌నోహ‌ర్ చెప్పిందే వేదంగా ప‌నిచేస్తూ మిగ‌త నేత‌ల‌ను చిన్న చూపు చూస్తున్నారా..? జ‌న‌సేన పార్టీలోకి అధిప‌త్య ధోర‌ణి న‌చ్చ‌క‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హ‌ర‌శైలీ బాగాలేక‌పోవ‌డంతోనే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌సేన పార్టీని వ‌దిలేందుకు స‌న్న‌ద‌మయ్యాడా...? జ‌న‌సేన‌కు దూర‌మై.. వైసీపీకి ద‌గ్గ‌ర అవుతున్నాడా....?  ఇది ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌.


అందుకు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా ఈ చ‌ర్చకు దారి తీసింది. ఇంత‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఏమీ చేసారు.. ఇప్పుడు ఎందుకు ఇలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయో ఓసారి చూద్దాం. జ‌న‌సేన త‌రుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌. ఆయ‌న ఇటీవ‌ల పార్టీ స‌మావేశంకు కాస్త ఆల‌స్యంగా వెళ్ళారు. ఆ స‌మావేశంలో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాజీ స్పీక‌ర్ నాదేండ్ల మ‌నోహ‌ర్ ఉన్నారు. వేదిక మీద‌కు వెళ్లిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ను నాదేండ్ల మ‌నోహ‌ర్ దురుసుగా దూషిస్తూ, మ‌న‌స్థాపం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ట‌. ఇది స్వ‌యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలోనే జ‌రిగింది.


నాదేండ్ల మ‌నోహ‌ర్ పార్టీకి ఉన్న ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ను దూషిస్తున్నా కూడా క‌నీస స్పంద‌న లేకుండా గ‌మ్మున ఉండిపోయారు. అంటే ఓ ద‌ళిత ఎమ్మెల్యే పార్టీలో గెలిస్తే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. పార్టీ స‌మావేశానికి స‌కాలంలో రావాలి.. కానీ ఎమ్మెల్యేగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండాల్సిన ప‌నులు ఉంటాయి.. కాస్త ఆల‌స్యంగా వ‌స్తే పార్టీలో కొంప‌లు అంటుకుపోయే ప‌రిస్థితి ఏమీ లేదు.. అయితే నాదేండ్ల మ‌నోహ‌ర్ ఓ ద‌ళిత ఎమ్మెల్యేను ఇలా దూషించ‌డం, ప‌క్క‌నే ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప‌ట్టించుకోకుండా, నాదేండ్ల మ‌నోహ‌ర్‌కు స‌పోర్టుగా ఉండ‌టంతో ఎమ్మెల్యే మ‌న‌స్థానం చెందారు.


పార్టీ అధినేత ముందే ఇంత జ‌రుగుతున్నా కిమ్మ‌న‌కుండా ఉన్న‌నేప‌థ్యంతో త‌న అవ‌స‌రం పార్టీకి లేద‌ని రాపాక గ్ర‌హించ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఎమ్మెల్యేను దూషిస్తే కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మ‌న‌స్థాపం చెందారు కానీ, అధినేత ప‌వ‌న్ ప‌ట్టించుకోక‌పోవడంతో బాగా హార్ట్ అయిన రాపాక ఇక జ‌న‌సేన‌కు దూరం జ‌రిగి, వైసీపీ కి ద‌గ్గ‌ర కావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే టాక్ వినిపిస్తుంది. అందుకు త‌గిన విధంగా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్‌ ఆటోస్టాండ్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీకి ఆటో డ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌తో క‌లిసి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు.


సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు పాల్గొన‌డం ఆన‌వాయితీగానే వ‌స్తుంది. కానీ అధికార సీఎం చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకాలు చేయ‌డం, దండ‌లు వేయ‌డాలు వంటి వాటికి దూరంగా ఉంటారు.. కానీ ఇక్క‌డ స్వ‌యంగా ఎమ్మెల్యే రాపాక‌నే పాలు తీసుకుని సీఎం జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేయ‌డంతో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదేమైనా రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక‌వేళ పార్టీ క‌నుక మారితే అది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఫ‌ల్యం త‌ప్ప మ‌రోక‌టి కాదనేది స‌త్యం.


ఇక పార్టీలో నాదేండ్ల మ‌నోహ‌ర్ క‌ర్ర‌పెత్త‌నం బాగా సాగుతుండ‌టంతో పార్టీకి ఉన్న ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే దూర‌మ‌యితే అది పార్టీలో పెరిగిపోయిన అహంకార వైఖ‌రికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. అదే క్ర‌మంలో ఓ ద‌ళిత ఎమ్మెల్యే ఎదుగుద‌ల‌ను కూడా ఓర్చుకోలేని నైజం ఇక్క‌డ బ‌య‌ట‌ప‌డిన‌ట్లే లెక్క‌. ఏదేమైనా జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ రాబోవు రోజుల్లో పార్టీ మార‌కుండానే, అధికార పార్టీకి త‌న‌వంతుగా ప‌నిచేస్తాడా.. లేక కండువా మార్చుకుంటాడా వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: