హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ నాయకుడు పటేల్‌ రమేష్‌ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ రెడ్డి పలు అంశాలపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్‌ రెండో దఫా పాలన పడకేసిందన్నారు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్టల నిలిచిందన్నారు రేవంత్‌ రెడ్డి.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో లేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్‌ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల బాధ్యతారహితమైన మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు కేసీఆరే కారణమన్నారు. 


ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్‌ వసూలు చేస్తూ....  ఎయిర్‌ బస్‌కు మాత్రం 1శాతం ట్యాక్స్‌ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.85 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే అధికారం కేసీఆర్‌కు లేదని... కోర్టులతో ఆటలాడితే.. కేసీఆర్‌కు మొట్టికాయలు తప్పవన్నారు. ఉద్యమ నాయకులేవరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడం దారుణమన్నారు రేవంత్‌ రెడ్డి.

కేసీఆర్‌ నియంతృత్వాన్ని, నిర్భంధాన్ని అణచివేయాలంటే.. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ నిజామాబాద్‌లో తన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ తాను మాత్రం హుజూర్‌నగర్‌లో తన అ‍క్కను గెలిపించుకుంటానని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవన్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అభిప్రాయ బేధాలు ఉండవని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: