మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే ఉంటుంది, ఇంకా వాటికీ సామర్థ్యం ఉంటే పాసింజర్‌ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. పాసింజర్‌ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరం మాత్రమే, పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పాసింజర్‌లా  12 లక్షల కిలోమీటర్ల  తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు.  సామర్థ్యం లేని బస్సులను ఏటా గుర్తించి వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

గత ప్రభుత్వం ఐదేళ్లపాటు అలాంటి చర్యలేవీ చేపట్టకుండా సామర్థ్యం లేని పాత బస్సులనే కొనసాగించిందన్న విమర్శలున్నాయి. సంస్థ  కార్మిక సంఘాలు ఈ విషయాన్ని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ నార్త్‌ ఈస్టు కోస్ట్‌  పరిధిలోని తొమ్మిది డిపోలలో 789 బస్సులున్నాయి. వీటిలో 587 బస్సుల సంస్థవి కాగా మిగిలినవన్నీ అద్దె ప్రాతిపదికన ఉన్నవే. అయితే సంస్థ బస్సుల్లో 208 వరకూ సుమారు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవని సమాచారం. మోటారు చట్టం ప్రకారం 11 నుంచి 12 లక్షల కిలోమీటర్ల మధ్య రవాణా చేసిన బస్సులను సర్వీసుల నుంచి తొలగించాల్సి ఉంది. సంస్థ మెకానికల్‌ విభాగం ద్వారా తనిఖీ చేశాక వాటి సామర్థ్యం మెరుగ్గా ఉందనిపిస్తే కొన్నాళ్ల వరకూ తిప్పుకొనే అవకాశం ఉంది.

కానీ అలాంటి చర్యలేవీ చేపట్టకుండా గత పాలకులు కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి  పంపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా రోజుకు 300 కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన బస్సుల్ని 400 కిలోమీటర్ల వరకూ నడిపిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు, సమయాభావంలేని ప్రయాణం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దూర సర్వీసులలో ఇలాంటి బస్సులే ఏర్పాటు చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ అన్ని రీజియిన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆయా బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.  బస్సుల రవాణా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి సర్వీసులకు పంపుతామని, తాజాగా రద్దు చేసి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేశాం. రద్దు చేసిన బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు నడిచినవి. వాటి స్థానంలో కొత్త బస్సులు వస్తే సంస్థ సేవలు మరింత మెరుగుపడతాయి. సామర్థ్యంలో లేని బస్సులను నిర్వహించడం లేదు. సంస్థకు ప్రభుత్వం ప్రకటించిన రుణసాయం కొత్తబస్సుల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎంఈ అన్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: