ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్ పై టీఎస్ ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బంద్ జరిగిన తీరుపైనా.. రేపటినుంచి చేపట్టబోయే కార్యక్రమ వివరాలను జేఏసీ తెలియజేసింది. బంద్‌ను సక్సెస్ చేసినవారందరికీ జేఏసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది.

 

 

ప్రభుత్వ ధోరణిపై రేపు అన్ని రాజకీయ పార్టీ నేతలతో భేటీ అవుతామని జేఏసీ ప్రకటించింది. ఈనెల 23న ఓయూలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని చౌరస్తాలు, డిపోల వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు. ‘ఆర్టీసీని రక్షించండి-ప్రజా రవాణాను కాపాడండి’ నినాదంతో నిరసనలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరపాలని జేఏసీ డిమాండ్ చేసింది. కోర్టులకు ఇచ్చే అఫిడవిట్లలో సర్కార్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని నాయకులు అన్నారు. మహిళా కార్మికులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

 

 

తెలంగాణ బంద్ ప్రభుత్వానికి ఓ గుణపాఠమని జేఏసీ నాయకులు అన్నారు. ఉద్యమకారుల తలలు నరికినా పోరాటం ఆగదని జేఏసీ తేల్చి చెప్పింది. రేపు అన్ని బస్సు డిపోల వద్ద ప్లకార్డులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. జేఏసీ ప్రకటనతో సమ్మె ప్రభావం మరింత తీవ్రం కానుంది. ప్రభుత్వం కూడా మెట్టు దిగకపోవడంతో సమ్మె మరెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: