దివంగత వైఎస్సార్....ప్రజలకు ముందు సంక్షేమం, ఆరోగ్యం అందిస్తే, ఆ తర్వాత ఆటోమేటిక్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విధానంలో పరిపాలన చేసిన విషయం తెలిసిందే. ఇక అదే విధానాన్ని ప్రస్తుత ఏపీ సీఎం, వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. అలాగే ఆయన తండ్రి ప్రవేశ పెట్టిన అతి ముఖ్యమైన పథకం ఆరోగ్య శ్రీకి మరిన్ని మెరుగులు దిద్ది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని అనుకుంటున్నారు. దీంతో పాటు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


తాజాగా రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో ఈ పథకాన్ని ఆరు దశల్లో అమలు చేయనున్నారు. అలాగే కంటి వెలుగు పథకాన్ని కాలేజీ పిల్లలకూ వర్తింపజేయాలని జగన్ సూచించారు. 108,104 అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి  తీసుకురానున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్య శ్రీ కంటే మెరుగ్గా సేవలు అందించేందుకు జగన్ సిద్ధమయ్యారు.


వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి ఆసుపత్రి ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నారు. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించనున్నారు. డిసెంబర్ 1 నుంచి చికిత్స చేయించుకున్నవారికి కోలుకునేంత వరకు నెలకు రూ.5వేలు.. లేదా రోజుకు రూ.225 ఆర్థిక సాయం అందించనున్నారు. డెంగ్యూ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చోటు కల్పించారు. అందరి ఆరోగ్యానికి సంబంధించి ఒక రిపోర్టు తయారుచేసి, దాన్ని ఆరోగ్యశ్రీ కార్డుల రూపంలో డిసెంబర్‌ 21న ఇవ్వనున్నారు.


అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా 2వేల వ్యాధులకు చికిత్స అందించనున్నారు. జనవరి 1 నుంచి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్న వారికి కూడా నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నారు. వీరితో పాటు పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్లు చేతులు లేనివారికి రూ.5వేల పింఛన్ ఇస్తారు. అయితే ఇవన్నీ జగన్ కేవలం తాను అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోపే చేసేస్తున్నారు. ఏదేమైనా వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ కంటే ఎన్నో రేట్లు మెరుగైన సేవలు అందిస్తూ జగన్.. తండ్రిని మించిపోతున్నారనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: