తెలంగాణ‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్న సూర్యాపేట జిల్లాలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.ఈ నెల 21 న జరిగే పోలింగ్‌ కు ఎన్నికల కమిషన్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. హుజూర్‌ నగర్‌ లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం ఎలక్షన్‌ కమిషన్ 302 పోలింగ్‌ స్టేషన్ లను ఏర్పాటు చేసింది. హుజూర్‌ నగర్‌ అర్బన్‌ లో 31 పోలింగ్‌ కేంద్రాలు, రూరల్‌ లో 271 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 79 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 2 వేలకు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. 967 బ్యాలెట్‌ యూనిట్లు, 363 కంట్రోల్‌ యూనిట్లతో పాటు 378 వీవీ ప్యాట్‌ లను ఉపయోగిస్తున్నారు.


ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ  అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాయి. హుజూర్​నగర్​ కాంగ్రెస్​ సిట్టింగ్​ సీటు కావటంతో ముందునుంచీ  ప్రచారం హోరెత్తించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీలో ఉండటం, రాష్ట్ర కాంగ్రెస్​ ముఖ్యులందరూ ప్రచారానికి దిగటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ కనబడింది. సీఎం కేసీఆర్​ సభ రద్దు కావటంతో రెండు రోజులుగా టీఆర్ఎస్ డీలా పడింది. తమ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించేందుకు టీఆర్ఎస్​ పార్టీ ఇతర జిల్లాల నుంచి వేలాది మందిని మోహరించింది. మరోవైపు రాష్ట్రంలో బలం పుంజుకున్న బీజేపీ ఇక్కడ నిలకడగా ప్రచారం కొనసాగించింది. టీడీపీ అభ్యర్థి పోటీలో ఉండటం, స్వతంత్ర్య అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో ప్రధాన అభ్యర్థుల ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. నేరేడుచర్ల మండలంలో 34 వేల 87 మంది ఓటర్లు ఉండగా.. 43 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలకీడు మండలంలో 19 వేల 639 మంది ఓటర్లకుగానూ 25 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు మఠంపల్లి మండలంలో 34 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం ఈసీ 43 పోలింగ్‌ స్టేషన్లను అందుబాటులో ఉంచింది. మేళ్లచెరువు మండలంలో 41 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేయగా.. 31 వేల 270 మంది ఓటర్లు ఉన్నారు. చింతలపాలెం మండలంలో 25 వేల 228 మంది ఓటర్లు ఉండగా.. ఈసీ 36 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. హుజూర్‌ నగర్‌ మండలంలో 47వేల 886 మంది, గరిడేపల్లి మండలంలో 43 వేల 877 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు మండలాల్లో 57 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటుచేసింది. కాగా, 24వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: