ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కేవలం పేద, బలహీన వర్గాల వారినే కాకుండా.. సామాజిక వర్గాల వారీగానే కాకుండా రంగాల వారీ గానూ జగన్ కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అలాంటి వాటిలో వైఎస్సార్ నవోదయం ఒకటి. ప్రభుత్వాలు ఎంత సేపూ పేదలు, ఓటు బ్యాంకు రాజకీయాలపైనే కాకుండా ఉపాధి కల్పించే పరిశ్రమలపైనా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను జగన్ ఈ పథకం ద్వారా చాటి చెప్పినట్టయింది.


సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలను ఏక కాలంలో రీషెడ్యూలు చేసేందుకు ఈ వైఎస్సార్ నవోదయం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవలే వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామివేకవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రారంభించింది. ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 2020 మార్చి 31 తేదీ లోపు రుణాలను రీషెడ్యూలు చేసేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.


రిజర్వు బ్యాంకు సూచనల మేరకు రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆ ఇబ్బందులు నుంచి తప్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 9 నెలల కాలంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన రుణాలను రీషెడ్యూలు చేసేలా సదరు బ్యాంకులకు ప్రభుత్వం హామీలు జారీ చేయనుంది.


ఒన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ పేరిట ఈ కార్యాచరణను చేపట్టనున్నారు. 2020 మార్చి 31 లోగా ఎంఎస్ఎంఈల రుణ ఇబ్బందులను తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రుణాలు 2019 జనవరి 1 తేదీ నాటికి 25 కోట్ల రూపాయలను మించి ఉండకూడదని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.


రుణాల రీషెడ్యూలుకు సంబంధించి 25 కోట్ల వరకూ బకాయిపడిన సూక్ష్మ చిన్నమద్యతరహా పరిశ్రమలను పరిగణనలోకి తీసుకోనున్నారు. రుణాల రీస్ట్రక్చర్ కోసం ఎంఎస్ఎంఈలు 2020 మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ఫలిస్తే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల తలరాత మారినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: