ఈ రోజు తెలంగాణ బంద్ పూర్తిస్థాయిలో విజయవంతం అయిందని భావించిన నేతలు.. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వేతనం రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామనే విషయాన్ని కూడా వారు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేదా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలసి మద్దతు కోరాలని జేఏసీ నిర్ణయించింది. దీంతోపాటు బంద్‌లో పాల్గొని తీవ్రంగా గాయపడిన సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావును జేఏసీ నేతలు పరామర్శించనున్నారు.తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుంటున్నారు.రేపు రాజకీయ పార్టీల నేతలను కలవనున్నారు.

అలాగే, తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలను కూడా కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకాలని కోరనున్నారు.20వ తేదీ ప్రధాన కూడళ్లలో ప్రజలకు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం దారుణమన్నారు.             

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో.. తన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యకు ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది అని చెప్పారు. అవసరమైతే మరోసారి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలుస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు.                                                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: