తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ... ఎన్నికల ముందు  ప్రధాని  మోడీతో విబేధించానని పేర్కొన్నారో  కానీ, బీజేపీ నేతలు మాత్రం ఆయన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. బీజేపీ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు వేస్తోన్న కొత్త ఎత్తుగడ ఇదంటూ విమర్శిస్తున్నారు . రాజకీయ విలువలు లేని టీడీపీ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు .  చంద్రబాబు చిడతలు వాయిస్తున్నట్లుగా ఉన్న ఫోటో ను ట్విట్టర్ లో  పోస్ట్ చేస్తూఅయన , టీడీపీ నాయకత్వం పై  తీవ్ర విమర్శలు చేశారు .


  అవినీతే లక్ష్యంగా అవకాశవాద రాజకీయాలతో యూ టర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన టీడీపీ..ఇప్పుడు ఏ మొహంతో పొత్తుకోసం వెంపర్లాడుతోందని ప్రశ్నించారు .  టీడీపీతో పొత్తుకు ఎప్పుడో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా  శాశ్వతంగా తలుపులను  మూసేశారని చెప్పారు . ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పని అయిపోయిందని , ఇక బీజేపీ లో విలీనం చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చంద్రబాబు కు ప్రతిపాదించారు . భవిష్యత్తు లో టీడీపీ తో పొత్తు ప్రతిపాదనే లేదని స్పష్టం చేశారు . ఏపీ లో ఎవరో నేతలు వచ్చి తమని గెలిపించాల్సిన అవసరం లేదని అన్నారు .


 దేశం లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే , ఏపీలోనూ బలపడుతామని అన్నారు . అయితే బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలపై టీడీపీ నాయకత్వం మౌనం పాటించడం పట్ల తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు . ఏపీ లో ఒక్క సీటు కూడా గెలువని బీజేపీ లో తమ పార్టీ ని విలీనం చేయాల్సిన అగత్యం తమకు పట్టలేదని అంటున్నారు . తమ అధినేత చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరించి , ఇష్టారీతి లో మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: