ఏపీలో తెలుగు దేశం నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షనేత గగ్గోలు పెడుతుంటారు. కానీ విచిత్రం ఏంటంటే.. చాలాచోట్ల వైసీపీ వారిపైనా దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక భౌతికదాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇందుకు ఉదాహరణలు చూపుతున్నారు. మూడు రోజుల క్రితం వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తను హతమార్చారు.


తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ట గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త గొర్లె శివాజీగణేష్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గణేష్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటినా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గణేష్‌ మాట్లాడుతూ గతంలో బీజీపీ నాయకుడు ఎన్‌.ఈశ్వరరావు, టీడీపీ నేత పిసిని జగన్నాథం చేసిన అకృత్యాలపై ప్రశ్నించినందుకు కక్ష గట్టి దాడి చేయించి ఉంటారని తెలిపాడు.


గణేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్లుగా ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ లో క్రియాశీలక కార్యకర్తగా పని చేసేవాడు. నరసన్నపేట వద్ద డోల ఈయన స్వగ్రామం. దాడి ఘటన తెలిసిన వెంటనే జె.ఆర్‌.పురం ఎస్సై బి.అశోక్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


బోరుభద్ర పంచాయతీ కామధేనువు గ్రామానికి చెందిన కణితి దీనబంధుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్వగ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై కృష్ణరాయపురం వెళుతుండగా గ్రామ మలుపు వద్ద కొందరు వ్యక్తులు ఆపారు. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు, వెనుక ఓ వ్యక్తి, రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బైకును ఆపిన వెంటనే ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడిచేసి రెండు చేతులు విరిగేలా కొట్టారని, ఇంతలో హరిదాసుపురం వైపు నుంచి మరో బైక్‌ రావడంతో నిందితులంతా కారులో పారిపోయారని దీనబంధు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: