రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ రైలు సమయానికి రాకుంటే ప్రయాణికులకు పరిహారం చెల్లించే విధానాన్ని తొలిసారిగా ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ కు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ రైలు గంట ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు 100 రూపాయలు, రైలు 2 గంటలకు పైగా ఆలస్యంగా వస్తే 250 రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు 25 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది. 
 
లక్నో న్యూ ఢిల్లీ మధ్య తిరిగే తేజస్ రైలు నిన్న 2 గంటలు ఆలస్యంగా నడిచింది. రైలు 2 గంటలు ఆలస్యంగా నడవటంతో పరిహారం కింద 250 రూపాయలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ చెల్లించింది. రైలు 2 గంటలు ఆలస్యంగా నడవటం వలన 250 రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల మొబైళ్లకు సందేశాలు పంపింది. 450 మందికి పైగా ప్రయాణికులకు 250 రూపాయల చొప్పున పరిహారం అందినట్లు సమాచారం. 
 
ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల సామాగ్రి చోరీ అయినా లేక ప్రయాణికుల వస్తువులు ఏవైనా దోపిడీ జరిగినా కూడా లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది. అక్టోబర్ 4వ తేదీన ఈ రైలు ప్రారంభమైంది. ఇతర దేశాల్లో కూడా రైలు ఆలస్యంగా వస్తే ఇచ్చే పరిహారం ఒక్కో విధంగా ఉంటుంది. యూకెలో రైలు ఆలస్యంగా వస్తే నష్ట పరిహారం నేరుగా కార్డ్ లో జమ అవుతుంది. పారిస్, జపాన్ లో ట్రైన్ ఆలస్యం అయితే ట్రైన్ డిలే సర్టిఫికెట్ ఇస్తారు. 
 
ట్రైన్ డిలే సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా పాఠశాలలకు అనుమతిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉన్న ఉద్యోగులు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లవచ్చు. తేజస్ రైలులో ఓఆర్ మిషన్ ద్వారా నీళ్లను, వెండింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీని పొందవచ్చు. ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ టికెట్ ధర 1280 రూపాయలు కాగా ఏసీ చైర్ టికెట్ ధర 1125 రూపాయలుగా ఉంది. వారంలో ఆరు రోజులు లక్నో న్యూ ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: