బాలికల పాఠశాలల్లో మగ టీచర్లు వద్దని రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాజస్థాన్ రాష్ట్రంలో బాలికల పాఠశాలల్లో పని చేస్తున్న 50 సంవత్సరాలలోపు మగ టీచర్లను వెనక్కు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి ఈవ్ టీజింగ్ కేసులు కారణమని తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా 50 సంవత్సరాలలోపు వయస్సు గల పురుష ఉపాధ్యాయులను వెనక్కు పిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
మంత్రి మాట్లాడుతూ బాలికల పాఠశాలల్లో పని చేస్తున్న పురుష ఉపాధ్యాయుల గురించి అధికారులను నివేదిక ఇవ్వాలని కోరినట్లు, నివేదిక అందిన తరువాత మహిళా టీచర్ల నియామకం అమలుకు సంబంధించిన నిర్ణయాల్ని తీసుకుంటామని తెలిపారు. బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్ల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నట్లు, మహిళలు సరిపోని పక్షంలో 50 సంవత్సరాల వయస్సు దాటిన పురుషులను నియమించాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 
 
ఈ నిర్ణయం పట్ల రాజస్థాన్ ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనిసెఫ్ మాజీ పాలసీ ప్లానర్ కేబీ కొటారి మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం 1,019 బాలికల పాఠశాలలు మాత్రమే ఉన్నాయని ఈ పాఠశాలలలో పనిచేస్తున్న 50 సంవత్సరాలలోపు పురుషులను వెనక్కు పిలవడం సులభమేనని అన్నారు. కానీ ప్రభుత్వం తీసుకునే ఈ చర్య వలన మిగతా పాఠశాలల్లోని విద్యార్థినుల తల్లిదండ్రులు భయానికి లోనవుతారని అన్నారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం 3,80,000 మంది టీచర్లు పని చేస్తున్నారు. పురుష, మహిళా టీచర్ల నిష్పత్తి 2 : 1 గా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో కొందరు సానుకూలంగా స్పందిస్తోంటే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. మరికొందరు సమస్యను పరిష్కరించే విధానం ఇది కాదని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం ఖచ్చితంగా అమలు చేస్తామని చెబుతోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: