హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌ను కీల‌కంగా తీసుకుంటున్న తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ క్ర‌మంలో ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ నేత‌,  మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై టార్గెట్ చేస్తోంది. హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. అయితే, వీరు అడ్వ‌కేట్ జేఏసీ అని ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్ప‌టికీ....టీఆర్ఎస్‌తో స‌న్నిహిత సంబంధాలున్న వార‌ని రేవంత్ వ‌ర్గం ఆరోపిస్తోంది. 


ఈ నెల 18, 19 తేదీల్లో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఎన్నికల సంఘం కార్యాలయంలోఅడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు ఫిర్యాదుచేశారు.ప్రజల మధ్య రాజకీయ, వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14  ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకుల, కార్యకర్తలపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులపై కర్రలతో దాడులు చేయాలని పిలుపునిచ్చారని ఆరోపించారు.


మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం రేవంత్‌పై విరుచుకుప‌డ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ తోడుదొంగలని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసు లో రూ.50 లక్షలతో పట్టుబడ్డ దొంగ రేవంత్‌రెడ్డి అయితే, 2014 ఎన్నికల సమయంలో తరలిస్తున్న రూ.3 కోట్ల డబ్బును కారులో తగులబెట్టుకున్న మరో దొంగ ఉత్తమ్ అని గుర్తుచేశారు. అడ్డంగా దొరికిన ఇద్దరు దొంగలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక కుంభకోణాలు చేసి జైళ్లకు వెళ్లింది కాంగ్రెస్ నాయకులేనని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డిని దుర్మార్గుడు, కబ్జాకోరు అని అంటున్నారని, అతనికి ఏ అధికారం ఉండి కబ్జాలకు, అక్రమాలకు పాల్పడ్డారో చెప్పాలని నిలదీశారు. దుర్మార్గాలు చేసింది ఉత్తమేనని...రౌడీలను పెంచి పోషించింది ఎవరో? రౌడీలు ఎవరి వెంట ఉన్నారో ప్రజలను అడిగితే చెప్తారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: