సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర గవర్నర్ తమిళ సై జోక్యం చేసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేత  అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై త్వరలో తాము గవర్నర్ ను కావాలనున్నట్టు తెలిపారు. 16 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసి స‌మ్మె భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌భుత్వం తీరు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఆదివారం అఖిల‌ప‌క్షం, ఆర్టీసి జెఎసి నేత‌లు స‌మావేశ‌మైయ్యారు.



ఈ స‌మావేశంలో తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, టిడిపి రాష్ట్ర అధ్య‌క్షులు ఎల్‌.ర‌మ‌ణ‌, టిజెఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం, త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు ఆర్టీసీ జేఏసీ మద్దతు ఉంటుందని తెలిపారు. పోటు రంగారావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆయన అన్నారు.మహిళా పారిశుద్ధ్య కార్మికులు వంద మందిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.



ఈ  దమనకాండను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.  అదే విధంగా తమ పొట్ట కొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కోరుతున్నామని చెప్పారు. కార్మికులు చేస్తున్న సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.  తమ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. రేపు అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికుల బైఠాయిస్తారని చెప్పారు. ఈ నెల 23న ప్రజా ప్రతినిధులతో భేటీ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న మహిళా కండక్టర్ల ర్యాలీ ఉంటుందని వివరించారు. అలాగే, ఈ నెల 30న సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ నేత తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: