ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మ‌రోమారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన మ‌రోమారు దుమ్మెత్తిపోసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి అండగా నిలవడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వెల్లడించారు. ప‌వ‌న్ సార‌థ్యంలో రాజకీయ వ్యవహారాల క‌మిటీ స‌మావేశం అనంత‌రం పార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు. 


జనసేన రాజకీయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. “పార్టీ సంస్థాగతంగా బలోపేతం, స్థానిక ఎన్నికలు, ఇసుక, మద్యం పాలసీలపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాలో కోట్లు గడిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను రూపుమాపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ బాటలోనే నడుస్తోంది. చీకటిపడితే అక్రమ ఇసుక రవాణాకు దారులు తెరుస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ ఏ ఊళ్లో చూసినా మద్యం ఏరులై పారుతోంది” అని ఆరోపించారు.


మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులను ఏ విధంగా రోడ్డున పడేశారో.. ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక ఉద్యోగులను అలాగే రోడ్డున పడేశారు. ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒక్క కలం పోటుతో తొలగించడం అనైతికం. కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, దశల వారిగా వారిని పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కమిటీ  నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్వూహాలపై కమిటీలో చర్చించాం” అన్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ వల్ల నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. 5 నెలలుగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఇసుక అందుబాటులో లేక రియల్ ఎస్టేట్ , సిమెంటు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రవాణా పరిశ్రమపై ఇసుక కొరత తీవ్ర ప్రభావం చూపింది. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించాలి తప్ప .. పాతవారిని తీసేసి కొత్త వారికి ఇవ్వడం సబబు కాదు”అని మ‌రోనేత భరత్ భూషణ్ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: