ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్‌రెడ్డి మ‌రోమారు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. అమ‌రావ‌తి నుంచి సీఎం జగన్ సోమ‌వారం ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. అంతకుముందు ఆయన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ  పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. 


ఈనెల 12వ తేదీన ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన రద్దు అయింది. కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ ఢిల్లీ వెళ్లే షెడ్యూల్ ఖ‌రారు చేసుకోగా...మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉండ‌టంతో..జగన్ త‌న ప‌ర్య‌ట‌న‌ వాయిదా వేసుకున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇక తాజా స‌మావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ విషయాలను కేంద్రం ముందుంచే అవకాశముంది. కాగా, అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ అయ్యేందుకు ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయ‌న స‌మావేశం కాలేక‌పోయారు.  ప్రధాని మోదీతో సమావేశమైన  ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. 


ఢిల్లీ ప‌ర్య‌ట‌న కంటే ముందు  పోలీస్ అమ‌రుల‌కు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ నివాళులు అర్పిస్తారు.   సోమ‌వారం ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారు.




మరింత సమాచారం తెలుసుకోండి: