జ‌న‌సేన పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇసుక, లిక్కర్ పాలసీలు, వైసిపి ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక లభ్యత లేకపోవడం వల్ల పనులు లేక రోడ్డునపడిన భవన నిర్మాణ కార్మికుల పక్షాన నవంబర్ 3 లేదా 4వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, లాంగ్ మార్చ్ చేపట్టనున్నట్టు పవన్ కళ్యాణ్  వెల్లడించారు. ఈ ఉద్యమాన్ని తానే ముందుండి నడిపించనున్నట్టు స్పష్టం చేశారు. జన సైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 


పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... ``ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి ఇసుక విధానం, సరఫరా వ్యవహారంలో చాలా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. భవన నిర్మాణ కార్మికులతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మంది రోడ్డునపడ్డారు. ఎన్నికల అనంతరం భీమవరం పర్యటనకు వెళ్లిన సందర్భంలో సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఇసుక రీచ్ లలో ఉన్న సమస్యలపై మాట్లాడాలని కోరారు. ఈ సమస్య మీద దృష్టి సారించాం. అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇసుక రీచ్ లు, డంపింగ్ యార్డుల వద్దకు వెళ్లి ధరల్లో ఉన్న తేడాలను ప్రజల ముందు ఉంచాం. ఇసుక మాఫియాను ప్రోత్సహించడమే తెలుగుదేశం పార్టీ పరాజయానికి మూలకారణం అయ్యింది. వైసిపి వస్తే పరిస్థితి మారుతుందని ప్రజలు అనుకున్నారు. టీడీపీ పోయి వైసిపి రావడం మినహా మార్పు ఏమీ జరగలేదు.`` అని మండిప‌డ్డారు.


“లాంగ్ మార్చ్ రూపంలో చేపట్టనున్న ఈ ఉద్యమానికి పార్టీ జనరల్ సెక్రటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్ నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. నాడు కవాతుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపట్టే పోరాటానికి సహాయ సహకారాలు అందించాలి. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారి కన్నీరు తుడిచి, వారి ఆవేదనను ప్రజలకు తెలియచేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీసి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం. `` అని వెల్ల‌డించారు. 

కాగా ఉద్యోగుల విష‌యంలో జ‌గ‌న్ మడ‌మ తిప్పార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ``అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు అన్ని విద్యార్హతలు ఉన్నాయనీ, వారిని తొలగించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటే అందుకు అయిదింతల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ వాలంటీర్లను, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి తీసుకున్న వారినీ చూపించి భారీగా ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఉన్నత విద్యార్హతలు ఉండీ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాల్లో ఉద్యోగం చేస్తున్నవారిని తొలగించడం ఏమిటి? గ్రామసచివాలయం ఉద్యోగాల నియామకంలోనూ ఎన్నో గందరగోళాలు సృష్టించారు. ఎన్నికల సమయంలో  అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటామని మాట ఇచ్చిన పార్టీ ఇప్పుడు మడమ తిప్పింది" అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: