తెలుగు దేశం అనుకూల పత్రికగా పేరున్న ఆంధ్రజ్యోతి పత్రికకు చంద్రబాబు సర్కారు విశాఖలో కట్టబెట్టిన స్థలాన్ని తాజాగా జగన్ సర్కారు రద్దు చేసింది. ఇప్పుడు ఈ విషయంపై రచ్చ అవుతోంది. జగన్ నిర్ణయంపై ఘటుగా స్పందించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. తన సంపాదకీయం కొత్త పలుకులో ఏకంగా సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరారు.


రాధాకృష్ణ వాదన ఇలా ఉంది.. “ 1986లో అప్పటి ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’కే కాదు.. ఇతర పత్రికలకు కూడా విశాఖలో భూమి కేటాయించింది. పత్రికలకు తక్కువ ధరకు భూమి కేటాయించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలు మీడియా సంస్థలకు నామమాత్రపు ధరకు భూమి కేటాయించారు. ఇప్పుడు విశాఖలో కూడా గతంలోనే కేటాయించిన భూమిలో ప్రభుత్వం ఎకరం తిరిగి తీసుకున్నందున అదే సర్వే నెంబర్‌లో పక్కనే ఉన్న భూమినే ఇవ్వాలని కోరాం.


నిజానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమికి డబ్బు చెల్లించే అవసరం లేకపోయినా 50 లక్షలు చెల్లించడానికీ అంగీకరించాం. ఇదంతా అక్రమమనీ, మొదటిసారిగా ‘ఆంధ్రజ్యోతి’కి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారనీ మంత్రి పేర్ని నానితోపాటు జగన్‌ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం.


‘ఆంధ్రజ్యోతి’కి కేటాయించిన భూమి అక్రమమని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ఒక పని చేద్దాం. మేం ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకుంటాం. జగన్మోహన్‌రెడ్డి 45 వేల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారనీ, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనీ సీబీఐ నిర్ధారించినందున.. ఆయన కూడా సదరు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారా? ఇందుకు సిద్ధమేనా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు ఇతరులకు బురద పూయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉండదా!?.. అంటూ రాధాకృష్ణ సవాల్ విసురుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: