ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా సోమవారం  అయన   నివాస భవనం , క్యాంప్ కార్యాలయమైన  ప్రగతిభవన్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం నిర్ణయించింది . గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . సమ్మె విరమణకు కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతరు చేయకపోవడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు .. సమ్మె లో పాల్గొన్న కార్మికులకు అండగా ఉన్నామని చెప్పడానికే ప్రగతిభవన్ ముట్టడించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు .


 ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి పొద్దుపోయాక , సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసం లో సమావేశమయ్యారు . ఈ సమావేశానికి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , రేవంత్ రెడ్డి తో పాటు పార్టీలోని పలువురు సీనియర్లు హాజరయ్యారు . కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడి పిలుపు నేపధ్యం లో పోలీసులు అప్రమత్తమయ్యారు . ప్రగతిభవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు . ప్రగతిభవన్ పరిసరాల్లో  పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు . ఈ నెల 19 వతేదీన బంద్ నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల జెఎసి , అఖిలపక్షం , రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ కావడం తో రెట్టించిన ఉత్సాహం తో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది .


 సమ్మె లో పాల్గొన్న వారిని   విధుల్లో నుంచి తొలగిస్తున్నామని ప్రకటించిన  రాష్ట్ర ప్రభుత్వ, ఇక కార్మికులతో చర్చలు జరిపేది లేదని ఖరాఖండిగా ఇప్పటికే తేల్చి చెప్పింది . దీనితో పలువురు కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయి గుండెపోటు తో మృతి చెందగా , ఖమ్మం డిపో కు చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయగా , చికిత్స పొందుతూ మృతి చెందాడు . అయినా ప్రభుత్వం కార్మికులను చర్చలకు ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: