జిల్లాల టూర్లు బాబుకు బాగున్న‌ట్లున్నాయి. ఒక్కో జిల్లాల్లో రెండేసి రోజులు గడపడంతో  అటు అనుకూల  మీడియా ఫోకస్ ఎటూ తనవైపే ఉంటుంది. దాంతో జగన్ని, ఆయన పాలనను విమర్శించవచ్చు. క్యాడర్ తో ముచ్చటించవచ్చు. పార్టీ కోసం నేనున్నానంటూ భరోసా ఇవ్వవచ్చు. ఇలా అనేక పనులు చేయవచ్చు. అందుకే బాబు వరసగా జిల్లాలను చుట్టేస్తున్నారు.  పది రోజుల క్రితం విశాఖ జిల్లాకు వచ్చిన బాబు ఇపుడు శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు.


ఈ రోజూ, రేపూ బాబు శ్రీకాకుళం జిల్లా టూర్ ఉంది. పార్టీ సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు. అదే సమయంలో పార్టీ ఇపుడు ఎలా ఉందో నేతలను అడిగి తెలుసుకుంటారు. ఈ జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే ఎనిమిది వైసీపీ గెలుచుకుంది. కేవలం రెండు సీట్లు మాత్రమే టీడీపీ పరమయ్యాయి. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు సైతం ఓడిపోయారు. దీంతో పార్టీ సిక్కోలులో పడకేసింది.  ఇక నోరున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వల్ల కొంత పార్టీ ఉనికిలో ఉంది. ఇక ఎంపీగా గెలిచిన జూనియర్ ఎర్రన్నాయుడు సైతం ఇటీవల కాలంలో పెద్దగా సౌండ్ చేయడంలేదు. మరో వైపు మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ వ్యవహారం ఎపిసోడ్ ఏపీ అంతా చూసింది. దాంతో సిక్కోలు తమ్ముళ్ళు సైలెంట్ అయ్యారు. 


మరి వారిని బాబు ఎంతవరకూ రీచార్జి చేస్తారో, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూడాల్సిఉంది ఇదిలా ఉండగా చంద్రబాబు మొదట విశాఖ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం గుండా సిక్కోలు వెళ్తున్నారు. ఆయన దారిలో తూర్పు నియోజకవర్గంలో ఉన్న వెంకోజీపాలెంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. దాంతో విశాఖ తమ్ముళ్ళు కూడా బాబు టూర్లో పాలుపంచుకుంటారని అంటున్నారు.  మొత్తానికి పది రోజులు తిరగకుండానే బాబు వైజాగ్ రూట్ పట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: