విద్య జ్ఞానాన్ని ఇస్తుందేగాని, అజ్ఞానాన్ని పంచదు. అది చదువులోని గొప్పదనం. కాని నేటి సమాజంలో బ్రతుకు దెరువుకోసం చదువుకునే చదువులు మనిషి కళ్లను అహంకారం అనే పొరతో కప్పేస్తున్నాయనడానికి అక్కడక్కడ జరిగే సంఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చూ. చదువులు చెప్పవలసిన గురువులే సంస్కారహీనులై అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే అభివృద్దివైపు ప్రయాణిస్తున్న మానవుడు కులాన్ని ఎప్పుడో పాతి పెట్టాడు. కాని కొన్ని సందర్భాల్లో కులం పేరున ఇంకా ఇప్పటికి జరిగే అవమానాలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనే మరోటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. పూర్తి వివరాలు పరిశీలిస్తే..


గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016 లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో అటెండర్‌గా నియమితుడయ్యాడు. ఆ తరువాత కాలంలో వీసీగా వచ్చిన దామోదర నాయుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2019 ఏప్రిల్‌లో మురళీకృష్ణని ఉద్యోగం నుంచి తొలగించారు. అకారణంగా ఉద్యోగం నుంచి తీసివేయడం సరికాదని, ఉద్యోగం తిరిగి ఇప్పించాలని గత నెల 23 వ తేదీన వెలగపూడి సచివాలయంలో ని 2 వ బ్లాక్ వద్ద దామోదర్ నాయుడిని అటెండర్ మురళీ కృష్ణ, తన మిత్రుడు గుమ్మడి రాజేష్ తో కలిసి వేడుకున్నాడు. కాని ఆ సమయంలో వీసీ కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడినట్లు మురళీకృష్ణ తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ క్రమంలో గత నెల 24న దామోదర్ నాయుడుపై తుళ్ళూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సచివాలయంలో లోని సీసీ ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు గుంటూరులోని నవభారత్ నగర్ లో దామోదర్ నాయుడుని ఆదివారం అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలియజేశారు. ఇకపోతే ఇప్పుడు వీసీ స్థాయి వ్యక్తి అట్రాసిటీ కేసులో అరెస్టవడం సంచలనం రేపుతోంది..ఇప్పటికే కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, తరచుగా జరిగే ఇలాంటి సంఘటనలపట్ల తగిన రీతిలో చర్య తీసుకొని, పునరావృతం కాకుండా చూడాలని బాధిత సంఘాలు ఎన్నో సార్లు విన్నవించుకున్నాయి. మనిషి బ్రతుకు దెరువుకోసం పుట్టినకులం మనిషినే అవమానపరిచే విధంగా తయారవ్వడం నిజంగా దురదృష్టకరమని కొందరు పేర్కొంటున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: