కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మెట్రో నగరాలలో వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వాహనదారుల ఇంటి దగ్గరే డీజిల్ అందించాలని నిర్ణయం తీసుకుంది. అధికారులు 2020 సంవత్సరం జనవరి నెల నుండి ప్రయోగాత్మకంగా మెట్రో నగరాల్లో ఈ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోలియం, ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగంతో ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. 
 
చమురు సంస్థలు డీజిల్ వినియోగదారులకు నేరుగా అందించటం కొరకు ఒక యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. డీజిల్ అవసరమైన సమయంలో వినియోగదారులు మొబైల్ లో యాప్ ఉపయోగించి పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన కొంత సమయం తరువాత ఇంధన ట్యాంకర్ వినియోగదారుడి ఇంటి దగ్గరకు వస్తుంది. 
 
కొనుగోలు చేసిన డీజిల్ కు చెల్లించాల్సిన డబ్బులను కూడా యాప్ ఉపయోగించి చెల్లించవచ్చు. పెట్రోలియం సంస్థలైన హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ చేయటానికి ప్రణాళికలు వేస్తున్నాయి. 500 ప్రత్యేక డోర్ స్టెప్ ప్యూయల్ వెహికల్స్ ద్వారా ఈ సంవత్సరం చివరకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. 
 
పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం నుండి పెట్రోల్ డోర్ డెలివరీకి అనుమతి రావాల్సి ఉంది. డీజిల్ డెలివరీ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతూ ఉండటంతో త్వరలో పెట్రోల్ డోర్ డెలివరీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరే అవకాశం ఉంది. ఈ సేవలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొనిరావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: