తెలంగాణలోనే కాకుండా...పొరుగు రాష్ట్రాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఆర్టీసీ స‌మ్మె ఓ వైపు ఉధృతంగా సాగుతున్న త‌రుణంలోనే...దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం నుంచి పున: ప్రారంభం కానున్నాయి.విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతుండటంతో.. ప్రజారవాణాపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసు నుంచి ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీ, డీటీసీలతో చర్చించారు. ఉదయం పది గంటల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ, రవాణా అధికారులు, డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు.


ప్ర‌భుత్వం స‌మ్మె విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం...మ‌రోవైపు ఆర్టీసీ కార్మికులు స‌మ్మె విర‌మ‌ణ‌కు నో అంటున్న నేప‌థ్యంలో....ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థల బస్సులు ప్రజా రవాణాకు తిరిగే అవకాశాలు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర వాహనాల సంఖ్యను పెంచాలని మంత్రి పువ్వాడ ఆర్టీవోలకు ఆదేశాలిచ్చారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా.. ప్రతి బస్సును నిర్దేశించిన రూట్లలో నడపాలని.. పల్లె వెలుగు బస్సులను యథాతథంగా పాత తరహాలోనే తిప్పాలని డిపోల్లో షెడ్యూలును ఖరారుచేశారు.గరుడ, రాజధాని ఏసీ బస్సులను మాత్రం తాత్కాలిక డ్రైవర్లకు ఇవ్వరాదని, వీటిని నడుపడానికి డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని.. అందువల్లనే వాటిని బయటకు తీయడంలేదని మంత్రి పేర్కొన్నారు.


మ‌రోవైపు ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. బస్సుల్లో పాస్‌లన్నీ చెల్లుబాటు అవుతాయని, బస్‌పాస్‌లున్న విద్యార్థులు టికెట్ తీసుకోరాదని, టికెట్ తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదుచేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యార్థులకోసమే బస్సులు వెళ్లే ప్రాంతాల్లో కచ్చితంగా బస్సులు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లకు ప్రతిరోజు సాయంత్రం విధులు ముగియగానే మర్నాటికి సంబంధించిన రూటు, బస్ టోకెన్‌ను అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయం డిపోకు వెళ్లే డ్రైవర్లు ఆలస్యం చేయకుండా బస్సును తీసుకొని వెళ్లడానికి వీలవుతుంది. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ డ్యూటీల మాదిరిగానే రోజు విడిచి రోజు విధులను అప్పగించనున్నారు. సమ్మెకు ముందు నిర్వహించిన మాదిరిగానే కాలమాన పట్టికను సోమవారం నుంచి పకడ్బందీగా అమలుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: