తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు స‌త్తాకు, పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ప‌లుకుబ‌డికి సంబంధించిన స‌మస్య‌గా మారిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక నేడే జ‌ర‌గ‌నుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ తో పాటు మొత్తం 13 రాజకీయ పార్టీల అభ్యర్థులు మరో 15మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు ప్రారంభమైంది.  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.


సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో 2,36,842 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 1,16,415 మంది, మహిళలు 1,20,427 మంది. వీరుకాక మరో 101 మంది సర్వీస్ ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలకుగాను అర్బన్‌లో 31, రూరల్‌లో 271 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, వాటిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వెబ్ క్యాస్టింగ్‌ను ఏర్పాటుచేశారు.ఓటింగ్ కోసం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సామగ్రితో సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి రెండు విడుతలుగా శిక్షణ ఇచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో బందోబస్తు కోసం 2,350 మంది పోలీస్ సిబ్బందితోపాటు టీఎస్‌ఎస్పీ నుంచి 3 బలగాలను, 6 సెంట్రల్ ఫోర్స్ బలగాలను ప్రత్యేకంగా రప్పించారు. ఓటింగ్ యంత్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి 27 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉపఎన్నికల నిర్వహణకు 1,241 మంది సిబ్బంది పాల్గొంటుండగా, వీరిని ఆదివారం 27 రూట్లలో 94 బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్‌కు 302 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెటింగ్ యూనిట్లు 965, ఈవీఎంలు 372, వీవీ ప్యాట్లు 388 ఉపయోగిస్తున్నారు.


కలెక్టర్ అమయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ...``ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. 302 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇచ్చాం. ఓటింగ్ యంత్రాల్లో సమస్యలు తలెత్తితే బెల్ ఇంజినీర్లతో వెంటనే నివృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించాం. గ్రామాల్లో ఎన్నికల సిబ్బందికి పార్టీల నాయకులు సహకరించాలి.`` అని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: