ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఇక ముందుకు సాగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.. అమ‌రావ‌తిపై నెల‌కొన్న‌ తాజా రాజ‌కీయాలు చూస్తుంటే రాజ‌ధాని అనేది మ‌రోచోట‌కు త‌ర‌లే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి... అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణంపై వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి సానుకూలంగా లేద‌నే చెప్ప‌వ‌చ్చు. దీనికి కార‌ణం లేక‌పోలేదు.. వైసీపీ ముందు నుంచి అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం స‌రైంది కాద‌ని చెపుతూనే ఉంది. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌టా కూడా  వైసిపి స‌ర్కారు ఆది నుంచి అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగానే ఉన్న సంకేతాలు ఇచ్చింది... కానీ అప్పటి సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్ట‌కు పోయి నిధుల‌ను అడ్డ‌గోలుగా ఖ‌ర్చు చేశార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.


అమ‌రావ‌తి భూముల సేక‌ర‌ణ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు క్విడ్‌ప్రో కో కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అమ‌రావ‌తిలో అధికారం కేంద్రీకృతం చేయ‌కుండా, వికేంద్రీక‌ర‌ణ చేయాల‌ని, ఇక్క‌డ నిర్మాణాలు చేస్తే వాటికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని, ఏనాటికైనా ఇక్క‌డ ప్ర‌మాదాలే అని చెపుతూనే ఉన్నారు. కానీ చంద్ర‌బాబు వినిపించుకోలేదు.. అందుకే ఇక్క‌డే రాజ‌ధాని నిర్మాణం చేయాల‌ని చంద్రబాబు సంక‌ల్పించారు. అందుకు త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. నిధుల కోసం దేశాలు ప‌ట్టుకు తిరిగారు బాబోరు.. కానీ మూడ‌గులు ముందుకు ఆర‌డుగులు వెన‌క్కి అన్న చందంగా రాజ‌ధాని వ్య‌వ‌హారం సాగింది.


ఇక వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణం చేయడంతో రాజ‌ధాని అంశం తెర‌పైకీ వ‌చ్చింది.. అందుకే ప్ర‌ధానిని క‌ల‌సిన‌ప్పుడు కూడా రాజ‌ధాని నిధులు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అవినీతి చోటుచేసుకుందని చెప్పిన జ‌గ‌న్‌, ఆపై బొత్స  ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, భారీగా నిధులు ఖ‌ర్చు అంటూ  ప్ర‌క‌టించారు . దీనికి తోడు ఇప్పుడు నిపుణుల క‌మిటీ ఇచ్చిన రిపోర్టు ప్ర‌కారం  హైదరాబాద్‌లా ఒకేచోట కాకుండా 110 శాఖల కార్యాలయాలు వివిధ చోట్ల ఉండాలని. అంటే ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుకు  శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక‌ను ఆస‌రా చేసుకుని రాజ‌ధాని నిర్మాణం అమ‌రావ‌తిలో సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన‌ట్లే లెక్క‌.


ఇక ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైసీపీ రైతుల వ‌ద్ద నుంచి భూమిని సేక‌రించ‌డం స‌రికాద‌ని, బ‌ల‌వంతంగా లాక్కుకోవ‌డం కూడా స‌మంజసం కాద‌ని ఆ నాటి నుంచి చెపుతూనే ఉంది.. ప‌చ్చ‌ని పంట‌ల‌తో తుల‌తూగే ధాన్యగారంలో నిర్మాణాల పేరుతో అన్న‌పూర్ణ‌ను చిదిమేయ‌డం మంచిది కాద‌ని చెపుతూనే ఉన్నారు. కానీ చంద్ర‌బాబు మొండిగానే ముందుకు పోయి, రైతుల వ‌ద్ద నుంచి దాదాపుగా 32 వేల ఎక‌రాల‌ను సేక‌రించారు. ఇప్పుడు 32 వేల ఎక‌రాల రాజ‌ధాని అవ‌స‌రం లేదంటూ తాజాగా వైసిపి స‌భ్యుడు ఆర్కేరాసిన లేఖ చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.


అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉంచాల‌నుకున్నా ప్ర‌స్తుత ప్రాంతం స‌హేతుకం కాదు క‌నుక మ‌రోచోట‌కి మార్చాల‌న్న ప్ర‌తిపాద‌న ఉందని విన‌వ‌స్తోంది. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఈ వివ‌రాల‌ను స‌ర్కారు వెలువ‌రించ‌కున్నా నిపుణుల క‌మిటీ సిఫార్సుల మేర‌కు వెల్ల‌డించే ఆస్కారం క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఓవైపు విజ‌య‌వాడ‌కు స‌మీపంలో భారీ భూకంపాలు వ‌స్తాయ‌ని ఇటీవ‌ల శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. అందుచేత ఓవైపు నిపుణుల క‌మిటీ.. మ‌రోవైపు ప్ర‌కృతి వైప‌రీత్యాల ప్ర‌భావం.. అమ‌రావ‌తి పై నీలి నీడ‌లు క‌మ్ముకునేలా చేశాయ‌న్న‌మాట‌..


మరింత సమాచారం తెలుసుకోండి: