బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్న మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇకపోతే మహారాష్ట్రలోని 288 స్థానాలు, హరియాణాలోని 90 స్థానాలకూ ఒకే విడతలోనే ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో 3,237 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 235 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ బీజేపీ 164 చోట్ల, శివసేన 124 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టగా, ఇక విపక్ష కూటమిలో కాంగ్రెస్ 125, ఎన్సీపీ 125, మిత్రపక్షాలు 38 స్థానాల్లో బరిలో నిలిచాయి. ఇక్కడ మొత్తం 9.5 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


ఇంతేగాక కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకున్న హరియాణాలోని 90 స్థానాలకు 1,169 మంది పోటీ చేస్తుండగా వీరిలో మహిళలు 104 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం 2.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇకపోతే మహారాష్ట్ర, హరియాణాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో రెండోసారి కూడా అధికారం తమదే అనే ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు.  సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటడంతో ఆ పార్టీలో ఇప్పుడు గెలుపుపై అత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.


ఇక వీటితో పాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపూర్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి.. ఇకపోతే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతోన్న అతిపెద్ద ఎన్నికలు ఇవే కావడంతో అభివృద్ధి కంటే భావోద్వేగాలనే బీజేపీ ఎక్కువగా నమ్ముకోవడం విశేషం.


ఆర్టికల్ 370 రద్దును ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ పార్టీ వాడుకుంది. మరి ఓటర్లు ఏ మేరకు ప్రభావితమవుతారో అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. అంటే  ఈ నెల 24 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడు అధికార పగ్గాలు ఎవరివో తెలిసిపోతుంది. ఇక ఒకరకంగా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువగా గెలిచే అవకాశాలు  ఉన్నాయని ఇప్పటికే కొందరు ఫిక్సైనట్టుగా కనిపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: