టీడీపీతో వ్యూహాత్మకంగా విడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రం విశాఖ అయింది. అప్పట్లో ఆయన తరచూ విశాఖ వచ్చేవారు. ఇక ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రజా సంకల్పయాత్రను కూడా నిర్వహించారు. అంతే కాదు గాజువాకలో స్వయంగా పోటీ చేశారు. అయితే ఓడిపోయిన తరువాత పవన్ విశాఖ వైపు తొంగి చూడలేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి.


ఇక ఒక్కొక్కరూ పార్టీ మారుతున్న నేపధ్యం కూడా  ఉంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పార్టీకి గుడ్ బై కొట్టేశారు. మరో వైపు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్ధసారధి బీజేపీలో చేరిపోయారు. అసలే అంతంతమాత్రంగా  ఉన్న జనసేన బలం ఇపుడు తీసికట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో జనసేన తరఫున భారీ ర్యాలీకి పవన్ రెడీ అవుతున్నారు. నవంబర్ 3న లక్షమంది భవన నిర్మాణా కార్మికులతో భారీ ర్యాలీ విశాఖలో  నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఇసుక కొరతను ఆయుధంగా చేసుకుని జగన్ మీద తొలి సమరభేరీ మోగించాలని పవన్ నిర్ణయించారు. ఇది మంచి పరిణామమే. రాజకీయ పార్టీ అన్నాక జనంలో ఉండాలి. ప్రజా సమస్యల కోసం రొడ్డెక్కాలి. అవసరం అయితే ఎంతకైనా అన్నట్లుగా పోరాటాలు ఉండాలి.


కానీ పవన్ 2014 ఎన్నికల్లో బీజెపీ, టీడీపీకి మద్దతు ఇచ్చిన తరువాత నాలుగేళ్ల పాటు పెద్దగా జనంలోకి రాలేదు, నాటి ప్రభుత్వాల మీద విమర్శలు కూడా చేసింది లేదు. ఇదే తీరుగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  ప్రజా పోరాటాలు చేస్తే మంచి ఫలితాలు 2019 ఎన్నికల్లో వచ్చేవి అనే వారు కూడా ఉన్నారు.  ఇప్పటికైనా మించినది లేదు, పవన్ పోరాటాలు చేయడం మంచిదే కానీ, తనకంటూ ఒక రాజకీయ అజెండా జనసేన రూపొందించుకుంటే బాగుంటుంది అంటున్నారు. అచ్చం చంద్రబాబు చేసిన తరహాలో విమర్శలు చేయడం ద్వారా ఉనికి పోరాటాం చేస్తున్నార‌న్న అభిప్రాయం కలిగిస్తే మాత్రం జనసేనకే అది ఇబ్బంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: