టిక్‌టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్న ఓ ప్ర‌ముఖురాలి జీవితాన్ని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు మార్చ‌నున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అడంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగాట్ వైపు అంద‌రి దృష్టి ప‌డింది. తాజాగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయిపై పోటీ చేస్తున్నారు.సోనాలి భర్త సంజయ్ ఫోగట్ బీజేపీ నాయకుడు.. ఆయన మరణించిన తరువాత సోనాలి కూడా బీజేపీలో చేరారు. ఆమెను పార్టీ రాష్ట్ర మహిళా మోర్చ యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా బీజేపీ నియమించింది.



మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, బీజేపీ తమ ఎన్నికల అభ్యర్థుల రెండవ జాబితాలో సోనాలీ ఫోగాట్‌కు టిక్కెట్ కేటాయించినట్లు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా త‌న పేరు ఖ‌రారైన అనంత‌రం  సోనాలీ ఫొగాట్ మీడియాతో మాట్లాడుతూ...."భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసం ఉంచి..ఆదంపుర్​​ నియోజకవర్గ టికెట్​ ఇచ్చింది. నాకు ఓ అవకాశం కల్పించింది. మేము నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి.. హరియాణా వికాసానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడు వచ్చానని అసలు ఆలోచించడం లేదు.. ఇక్కడ విజయం సాధిస్తాను. కమలం వికసించి తీరుతుంది`` అని ప్ర‌క‌టించారు. 


సోనాలీ ఫోగాట్ 1979లో జన్మించారు. ఆమెను సన్నిహితులు సోను అని పిలుస్తుంటారు. లక్షమంది ఫాలోవర్స్ కలిగిన టిక్‌స్టార్‌గా పేరొందారు. కొన్ని సీరియళ్లలో కూడా నటించిన పోగ‌ట్ ఇటీవ‌ల గూగుల్‌లో ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. సోనాలీ ఫోగాట్ గురించి గూగుల్‌లో అత్యధిక నెటిజన్లు వెదికారు. వారు సోనాలీ వయసు ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి చూపించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కన్నా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడ్డా గురించి అత్యధికులు సెర్చ్ చేశారు. టిక్‌టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకున్న ఫోగట్..ప్ర‌చారంలోనూ దూసుకెళ్లారు. తాజాగా కొనసాగుతున్న పోలింగ్ ఆమె కెరీర్‌లో కీల‌క మ‌లుపుగా నిల‌వ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: