రైలు ప్రయాణం అంటేనే ఆలస్యానికి పెట్టింది పేరనే ప్రచారం చాలాకాలం నుండి ఉంది. ప్రకటించిన సమయాన్ని వదిలేసి ఎప్పుడొస్తాయో తెలియని రైళ్ల కోసం ఎంతోమంది పడిగాపులు గాచిన రోజులు ఎన్నటికి మరువలేని వారున్నారు. రైల్వే పై అసలే నమ్మకం లేని ఇలాంటి పరిస్దితుల్లో, దేశంలోనే మొదటి ప్రైవేటు రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించినప్పుడు ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యమైతే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ రైలు గంట ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు 100 రూపాయలు, 2 గంటలకు పైగా ఆలస్యంగా వస్తే 250 రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రారంభించేటప్పుడే ప్రకటించారు. అంతే కాకుండా ఈ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులకు 25 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది. ఇవేగాకుండా ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల సామాగ్రి చోరీ అయినా లేక ప్రయాణికుల వస్తువులు ఏవైనా దోపిడీ జరిగినా కూడా లక్ష రూపాయల బీమా వర్తిస్తుంది.  ఇకపోతే వారంలో ఆరు రోజులు లక్నో న్యూ ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది.


ఇక ఈ తేజస్ రైలులో ఓఆర్ మిషన్ ద్వారా నీళ్లను, వెండింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీని పొందవచ్చు.  ఈ రైలు ధరలను తెలుసుకుంటే ఎగ్జిక్యూటివ్ చైర్ టికెట్ ధర 1280 రూపాయలు కాగా ఏసీ చైర్ టికెట్ ధర 1125 రూపాయలుగా ఉంది.   అంతా బాగానే వుంది కాని తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అనే అనుమానం వద్దు. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడిన ఐఆర్‌సీటీసీ శనివారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటలు ఆలస్యం నడవడంతో అందులో ప్రయాణించిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది..


అందుకు గాను శనివారం రైలులో ప్రయాణించిన ప్రయాణికులందరి ఫోన్లకు ఒక వెబ్‌ లింక్‌ను సందేశం ద్వారా పంపించామని, ఆ లింక్‌ ద్వారా ప్రయాణికులు పరిహారాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ చీఫ్‌ రీజనల్‌ మేనేజర్‌ అశ్విని శ్రీవాస్తవ తెలిపారు. శనివారం లక్నో నుంచి ఢిల్లీకి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలోనూ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు 451 మంది, తిరుగు ప్రయాణంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇకపోతే దేశంలో రైలు ఆలస్యమైనందుకు అందులోని ప్రయాణికులకు పరిహారం అందించడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: