మహారాష్ట్ర, హరియాణాలలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు గాను నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఇకపోతే ఈ ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులు మోహరించారు. ఇదే గాకుండా మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.



అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక యూపీలో 11, గుజరాత్‌ 6, బిహార్‌ 5, అస్సాం 4, హిమాచల్‌ ప్రదేశ్‌ 2, తమిళనాడు 2, పంజాబ్‌ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్‌ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు.. మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ స్థానాలకు కూడా ఈ రోజే అనగా సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది.



ఈ పోలింగ్ లో ఓట్లు వేసెందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాక్టర్లపై, కాలినడకన గాని, మరే ఇతరమార్గాల ద్వారా గాని ఓటర్లు తమ ఓటు హక్కుని ఊపయోగించుకోవడానికి ఆసక్తిగా తరలి వస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని అధికారులు తెలిపారు..ఇకపోతే మహారాష్ట్ర, హరియాణాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో రెండోసారి తమదే అధికారమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: