తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హుజూర్ నగర్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవటం కొరకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధికారులు 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలం గుల్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గరిడెపల్లి మండలం గీతవారిపాలెంలో బీజేపీ అభ్యర్థి కోట రామరావు, హుజూర్ నగర్ లో టీడీపీ అభ్యర్థి కిరణ్మయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేరేడుచర్లలో ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తోంది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. 
 
గరిడెపల్లి ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ నిలిచిపోయినట్లు సమాచారం అందుతుంది. 9 గంటల వరకు 13.44 ఓటింగ్ శాతం నమోదు అయిందని తెలుస్తోంది. ఇప్పటివరకు 6 ఈవీఎంలు మొరాయించినట్లు మొరాయించిన ఈవీఎంలను మార్చినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. చింతలపాలెం 68వ పోలింగ్ కేంద్రంలో వెలుతురు లేక సిబ్బంది, ఓటు వినియోగించుకోవటానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 
 
చింతలపాలెం మండలంలోని బీజేపీ నాయకుడు మామిడాల వెంకటేశ్వర్లును పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇంటి బయట నిలబడితే పోలీస్ స్టేషన్ కు తరలించారని అభ్యర్థి చెబుతుండగా పోలీసులు మాత్రం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడని అందువలనే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లామని చెబుతున్నారు. హుజూర్ నగర్ లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలోను సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: