మంత్రివర్గం ఏర్పడిన నాలుగు మాసాలకే చాలామంది మంత్రులకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకిచ్చారు. నాలుగు నెలల క్రితమే నియమించిన ఇన్చార్జి మంత్రులందరికి  తాజాగా కొత్త జిల్లాలను కేటాయించటంతోనే తన మార్కు పరిపాలను జగన్ మంత్రులకు రుచిచూపించారు.

 

ఇంతకీ జరిగిందేమిటంటే తమకు కేటాయించిన జిల్లాల్లో చాలామంది మంత్రులు పట్టు సాధించలేకపోయారని సమాచారం. కొందరైతే తాము ఇన్చార్జిగా ఉన్న జిల్లాల పర్యటనల విషయంలోనే పెద్దగా శ్రద్ద చూపించలేదట. అదే సమయంలో మరికొందరు ఇన్చార్జి మంత్రుల వ్యవహార శైలిపై ఆయా జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, నేతల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని ఆరోపణలు వినబడుతున్నాయి.

 

కొన్ని జిల్లాల్లో అయితే ప్రజాప్రతినిధుల నుండి ఇన్చార్జి మంత్రులపై ఫిర్యాదులు నేరుగా జగన్ కే అందాయట. దాంతో తనకు అందిన ఫిర్యాదులపై పార్టీ నుండే కాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సమాచారం తెప్పించుకున్నారట. తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో అదే సమాచారాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల దగ్గర ప్రశ్నించినా ఉపయోగం కనబడలేదు.

 

ఆరోపణలపై జగన్ అడిగిన ప్రశ్నలకు కొందరు మంత్రులు బుకాయించారట. దాంతో లాభం లేదనుకుని మంత్రులందరినీ జిల్లాలను మార్చేయటం పార్టీలో సంచలనంగా మారింది. అదే సమయంలో మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ నాని లకు అసలు జిల్లాల ఇన్చార్జి మంత్రుల హోదా నుండే తప్పించారు.

 

అందుకు ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళకు కేటాయించిన జిల్లాల్లో పట్టు సాధించకపోవటమే. ముగ్గురు మంత్రుల మెతకదనాన్ని ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారట. అందుకనే చాలామంది నేతల్లో వాళ్ళపై అసంతృప్తి పెరిగిపోయింది.

 

స్వయంగా హోం మంత్రి అయ్యుండి కూడా మెకతోటి సుచరిత  నెల్లూరు జిల్లాలో ఎంఎల్ఏలు కాకాణి గోవర్ధనరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వివాదాన్ని సర్దుబాటు చేయలేకపోయారు. దాంతో కోటంరెడ్డిపై పోలీసులు కేసు పెట్టి  అరెస్టు చేశారు. దాంతో జనాల ముందు పార్టీ బాగా పలుచనైంది. ఇందుకు కారణం ఏమిటంటే ఎంఎల్ఏల మధ్య సర్దబుటు చేసేంత సీన్ సుచరితకు లేదని నిరూపితమైంది. అందుకనే బాధ్యతల నుండి తప్పించారు. మొత్తానికి మంత్రులందరికీ జగన్ పెద్ద షాకే ఇచ్చారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: