తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత చింతమనేని ప్రభాకర్. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని ఐదేళ్ల పాటు టిడిపి అధికారంలో ఉండటంతో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. టిడిపి ప్రభుత్వం పాలనలోనే చింతమనేనిపై మొత్తం 66 కేసులు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో మళ్లీ తనే గెలుస్తానని రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని విర్రవీగిన చింతమనేని కల రివర్స్ అయ్యింది. ఎన్నికల్లో చింతమనేని దెందులూరులో ఓడిపోగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.


ప్రస్తుతం టిడిపి చరిత్రలోనే ఎప్పుడూ లేనంత స్థితికి దిగజారడం తో ఇప్పుడు చింతమనేనిని సొంత పార్టీ నేతలే పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. అసలే కటకటాల వెనక ఉన్న చింతమనేనికి జైలులో ఇప్పుడు సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదన్న బాధ మరింత ఎక్కువైందట. అధికారం మారిన వెంటనే చింతమనేని పై వరుసగా కేసులు బయటికి వస్తున్నాయి. కేసుల మీద కేసులు... వెంటవెంటనే జైలుకు వెళ్ళేలా చేస్తున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన చింతమనేని పోలీసులు అరెస్టు చేశారు. నెలరోజులుగా జైల్లోనే ఉన్నారు.


ఇక తాజాగా 14 రోజులు రిమాండ్ విధించడంతో కోర్టుకు వచ్చిన చింతమనేని మళ్లీ జైలుకు వెళ్లారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు, మరో వైపు పాత కేసులు చింతమనేనిని జైలుకే  పరిమితం చేస్తున్నారు. మరోవైపు దెందులూరు నియోజకవర్గంలో టిడిపి నేతలు చింతమనేని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపిస్తున్న ఆయనపై కేసులు మాత్రం ఆగడం లేదు. అక్టోబర్ 9వ తేదీన చింతమనేనికి విధించిన రిమాండ్ పూర్తవడంతో ఆయన బయటకు వస్తారని ఆయన అభిమానులు ఆశించగా పోలీసులు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కేసు పెట్టి మళ్ళీ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీంతో మరో 14 రోజులు న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది.


ప్రస్తుతం చింతమనేని అక్టోబర్ 23 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ఇలా చింతమనేనిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అసలు ఆయన అప్పట్లో బయటకు వస్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గంలో పదేళ్లుగా చింతమనేని వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం చింతమనేని 66 కేసుల్లో నిందితుడిగా ఉండగా, 22 కేసులకు పైగా దర్యాప్తులో ఉన్నాయని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ సైతం ధృవీకరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చింతమనేని కేసులు పై పోలీసులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్లు సైతం తనను పెద్దగా పట్టించుకోవడం లేదని చింతమనేని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడితే.. తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు చంద్రబాబు తనకు బుద్ధి చెప్పారని చింతమనేని తన అనుచరుల వద్ద వాపోయారట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ దూరం జరిగినట్టు అనిపిస్తోందని సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఏదేమైనా వరుస కేసుల పరంపరలో చింతమనేని జైలు నుంచి ఎప్పటికి బయటకు వస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: