ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం, ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఐఎండి సూచిస్తుంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్ష సూచనలున్నాయంటున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు,  నెల్లూరు,  కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు  పడే అవకాశం ఉందంటున్నారు.


శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు.  ఇప్పటికే ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాల ముప్పు ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి వ్యాప్తంగా వర్షంహోరుతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. సవదత్తి తాలూకాలోని నవిలుతీర్థ జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బెంగళూరులోనూ వర్షం హోరు తీవ్రంగా ఉంది. రెండు నెలల క్రితం బెళగావిని వరదలు ముంచెత్తగా మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది



మలప్రభ నదీ తీరంలో హెచ్చరికలు జారీ చేశారు. సుమారు ఆరేడు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  బెళగావి జిల్లాధికారి పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం 1633.00 అడుగులకు చేరింది. వాస్తవానికి  నిల్వ సామర్ధ్యం 100.855 టీఎంసీలు. కాగా  35829 సి/ఎస్  వరద నీరు చేరుతుంది. 35637 సి/ఎస్ ప్రవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  కమీషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: