ఎన్నికలే పెద్ద ఆర్ధిక భారం అనుకుంటే ఉప ఎన్నికలు మరింత భారం. ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడాలంటేనే కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి. ఇక పంతానికి పోయి ఖర్చు చేస్తున్న ఎన్నికలైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. ఖర్చు ఎంత అన్నది ఎవరికీ తెలియకుండా పోతూనే ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలో ఏకైన ఉప ఎన్నిక హుజూర్ నగర్ ఇపుడు అందరికీ ఆకట్టుకుంటోంది. ఈ రోజు ప్రజా తీర్పు కూడా ఉంది.


మరి ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారు అన్నది అతి పెద్ద ఉత్కంఠగా మారింది. అటు అధికార పార్టీగా ఉన్న టీయారెస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనుకుంటోంది. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా గెలిచి సత్తా చాటాలని, ప్రభుత్వ వ్యతిరేకత చాటి చెప్పాలనుకుంటోంది. దాంతో మొత్తం సీన్ మారిపోయింది. ఉప ఎన్నిక కాస్తా కాంగ్రెస్ టీయారెస్ ల మధ్య ప్రెస్టేజిగా మారింది.


ఇక రెండు పార్టీలు ఎక్కడా తగ్గలేదు. పోలింగ్ కి రెండు రోజుల ముందు దాదాపుగా నలభై కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారు. పంపిణీ కూడా పెద్ద ఎత్తున చేశారని చెబుతున్నారు.  ఒక పార్టీ ఓటుకు వేయి ఇస్తే, మరో పార్టీ అయిదు వందల వరకూ ఇచ్చిందట. ఇక ఒట్లు  కూడా వేయించుకుని మరీ తమకే ఓటు వేయాలని పార్టీలన్నీ ఓటర్ల మీద వత్తిడి తెచ్చాయట.


ఇక ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ పట్టించుకోలేదని తెలిసిపోతోంది. ఓటరుని ఎలాగైనా ఆకట్టుకుని గెలవాలన్న ఉద్దేశ్యంతోనే  పార్టీలు అన్నీ కూడా డబ్బుని వెదజల్లాయని పక్కాగా క్లారిటీ వచ్చేసింది. మరి చూస్తే హుజూర్ నగర్ పోల్ పల్స్ ఎవరికి అనుకూలమో తెలియడంలేదు. జనాలు బారులు తీరి ఓట్లు వేశారు కానీ ఓటు ఏ వైపు పడిందో కూడా తెలియలేదు.



ఇంత చేసినా టీయారెస్ గెలిస్తే కాంగ్రెస్ పరువు పోయినట్లే. అలాగే కాంగ్రెస్ గెలిచి టీయారెస్ ఓడితే మాత్రం ఇక రాజకీయ పరిణామాలు శరవేగంగా  మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 24న ఫలితాలు వస్తాయి. అపుడు గెలిచింది ఎవరు అయినా అసలు  విజేత మాత్రం డబ్బేనని మరో మారు రుజువు అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: